Balakrishna : నోరు జారిన బాలయ్య.. చంద్రబాబుకు కష్టాలు తెచ్చిపెడతాయా?

Balakrishna

Balakrishna

Balakrishna : పరిపాలన ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ సిఫారసు, సుదీర్ఘ కసరత్తుల తర్వాత ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజిస్తూ గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏపీలో ఆందోళనలు చుట్టుముట్టాయి.

అవే పరిస్థితులు నేడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తోంది. 2022, ఏప్రిల్ 4న అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైనా, జిల్లాల పునర్విభజనతో పాటుగా జిల్లాలకు ఆయన పెట్టిన పేర్లు కూడా ఉద్రిక్తతకు కారణమయ్యాయి. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలు నాటి తేనే తుట్టెను కదిపినట్టు అయ్యింది.

హిందూపురానికి బదులుగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించింది. అప్పటి ప్రభుత్వం. దీనిపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గేది లేదని, జనాందోళనలను పట్టించుకోలేదు. తర్వాత ఎన్నికలు రావడం, ఇతర కారణాలతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఇలాంటి పరిస్ధితుల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన గొడవకు మరోసారి ఆజ్యం పోసినట్టయ్యింది.

జిల్లా కేంద్రాలను మార్చే దిశగా ఆలోచిస్తున్నామని సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని చేయాలనే డిమాండ్ ఉందని వ్యాఖ్యలు చేశారు. ఒక్క హిందూపురమే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లే ఉన్నాయి. జిల్లాలకు పెట్టిన పేర్లు అలాగే ఉంచి, కేంద్రాలను మాత్రం మారుస్తామని బాలయ్య చెప్పడం చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీకి చాన్స్
బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలతో పాత డిమాండ్లు తెరపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు లేకపోలేదనే కామెంట్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోయి నిరాశ, నిస్పృహలతో ఉన్న వైసీపీ జిల్లాల పునర్విభజన సమస్యలను నిద్రలేపి మళ్లీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

TAGS