Yuvagalam:స‌మ‌యం లేదు మిత్ర‌మా..విజ‌మా..వీర స్వ‌ర్గ‌మా!:బాల‌కృష్ణ‌

Yuvagalam:టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో ఏపీలో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన `న‌వ‌శ‌కం` పేరుతో టీడీపీ శ్రేణులు నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌ని బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం స‌మీపంలోని పోలిప‌ల్లిలో ఏర్పాటు చేశారు. లోకేష్‌యువ‌గ‌ళం పాద‌యాత్ర 226 రోజులు, 97 నియోజ‌క వ‌ర్గాల గుండా మొత్తం 3,132 కి.మీ సాగింది. ఈ నేప‌థ్యంలో విజ‌యోత్స‌వ స‌భ‌ని ఏర్పాటు చేశారు.

స‌భా ప్రాంగ‌ణానికి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌ల‌తో పాటు జ‌న‌సేన అధినేత‌, హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ నేత, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ, టీడీపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ స్థాయిలో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. వైకాపా అక్ర‌మాల‌కు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పాల‌న్నారు. ఆయ‌న మాట్లాడుతూ `లోకేష్ యువ‌గ‌ళంలో ప్ర‌జాగ‌ళం క‌దంతొక్కింది. పాద‌యాత్ర‌కు అనేక అడ్డంకులు సృష్టించినా విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు లోకేష్ ఓదార్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఒక చెత్త ప్ర‌భుత్వం ఉంది. ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా మార్చారు. అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌కుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. అమ‌రావ‌తికి హూములిచ్చిన రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేశారు. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామ‌ని పోల‌వ‌రం ప్రాజెక్టును నాలుగేళ్లు అయినా పూర్తి చేయ‌లేదు. పోల‌వ‌రాన్ని పూర్తి చేయ‌లేని చేత‌కాని ప్ర‌భుత్వం ఇది.

రాష్ట్రంలో డ్ర‌గ్స్ మాఫియా పెరిగిపోయింది. డ్ర‌గ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా నిలిపారు. ల్యాండ్‌, శాండ్ స్కాముల‌తో రూ.కోట్లు దోచుకున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుక‌బ‌డిపోయింది. రాష్ట్రానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు లేవు. యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు లేవు. వైకాపా అక్ర‌మాలు ఇలాగే కొన‌సాగితే.. ప్ర‌పంచ ప‌టంలో ఏపీ ఉండ‌దు. సైకో ఈ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. స‌మ‌యం లేదు మిత్ర‌మా..విజ‌యమా వీర స్వ‌ర్గ‌మా? తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి మ‌న‌ది. రాష్ట్ర భ‌విష్య‌త్తు ప్ర‌జ‌ల చేతుల్లో ఉంది` అని నంద‌మూరి బాల‌కృష్ణ వైకాపాపై నిప్పులు చెరిగారు.

TAGS