Bajaj Pulsar NS-400 : మార్కెట్ లోకి బజాజ్ పల్సర్ ఎన్ఎస్-400
Bajaj Pulsar NS-400 : ద్విచక్ర వాహన దిగ్గజం ‘బజాజ్ ఆటో’ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ ఎన్ఎస్ 400జీ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.85,000 (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా ప్రకటించింది. పుణెలో శుక్రవారం (మే 3) జరిగిన కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ బైక్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పల్సర్ ఎన్ఎస్ 400తో స్పోర్ట్స్ బైక్ విభాగంలో కంపెనీ స్థానం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
ఈ కొత్త బైక్ కోసం రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని, అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని సూచించారు. 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్బాక్స్, బ్లూ టూత్ కనెక్టివిటీతో కలర్ ఎల్సీడీ స్పీడో మీటర్, నాలుగు రకాల రైడ్ మోడ్స్ ఈ బైక్ ప్రత్యేకతలు. తమ కంపెనీకి చెందిన బైక్ పల్సర్ ను ఇప్పటి వరకు 1.8 కోట్ల వరకు విక్రయించినట్లు రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు.
స్పోర్ట్స్, కమ్యూటర్ బైక్స్, త్రిచక్ర వాహనాల మార్కెట్ లో మరింత పట్టు చేజిక్కించుకునేందుకు వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. 125 సీసీ బైక్స్ విభాగంలో కంపెనీ ఇప్పటికే 32 శాతం మార్కెట్ వాటా ఉందని, మరింతగా పెంచుకోవాలని చూస్తుందని రాజీవ్ బజాజ్ చెప్పారు.
జూన్లో సీఎన్జీ బైక్..
ఈ ఏడాది (2024) జూన్ 18వ తేదీన ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను ఆవిష్కరించనున్నట్లు రాజీవ్ బజాజ్ వెల్లడించారు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు ఈ బైక్కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
పన్నుల మోతతోనే అధిక ధరలు..
దేశీయంగా వాహన పరిశ్రమపై పెరుగుతున్న పన్ను భారంతో వాహన ధరలు గణనీయంగా పెరిగాయని రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో బైకులపై 8-14 శాతం పన్ను ఉండగా భారత్లో జీఎస్టీ 28 శాతం ఉందని తెలిపారు. ఈ కారణంగానే వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి కనిపించడం లేదని. ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాజీవ్ బజాజ్ తెలిపారు.