KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో బడేభాయ్ మోదీ.. హైద్రాబాద్ లో ఛోటేభాయ్ రేవంత్ వీరిద్దరూ మోసగాల్లేనని ఆరోపించారు. 2014లో బడే భాయ్ కి ఓటేసి మోసపోయామని.. 2023లో ఛోటే భాయ్ కి ఓటేసి మోసపోయామని అన్నారు. ప్రజల తరపున పోరాడాలంటే పార్లమెంట్ లో ఎంపీగా వినోద్ కుమార్ ఉండాలని, ఆయనకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని మాజీమంత్రి కేటీఆర్ కోరారు.
ఒక్కసారి మోసపోతే.. మోసం చేసినవాడిది తప్పు, రెండోసారి మళ్లీ వారి చేతిలోనే మోసపోతే.. తప్పు మోసపోయిన వాళ్లదే అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే ఆగస్టులో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టు పెడుతున్నాడని, అదే ఆయన భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టు పెట్టడం లేదని కేటీఆర్ ఆరోపించారు.