Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ గడువును మరో ఏడు రోజులు పొడిగించాలని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించింది. తదుపరి ఆదేశాల కోసం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు పంపింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం విదితమే.
ఈ బెయిల్ గడువు జూన్ 1తో ముగియనుండగా, ఆయన జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడు రోజుల పాటు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల ధర్మాసనం నిరాకరించింది. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ.. తన క్లయింట్ కు ప్రస్తుతం ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, అందుకు వారం రోజులు పడుతుందని అన్నారు. అందుకే ఈ పిటిషన్ పై అర్జెంటుగా విచారణ చేపట్టాలని, బుధవారం నాటి లిస్టింగ్ లో చేర్చాలని అభిషేక్ మను సింఘ్వీ కోరారు. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమని, వారం రోజులు మాత్రమే పొడిగించాలని కోరుతున్నామని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘‘ఈ పిటిషన్ మేము పరిశీలించాం, దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతాం, ఆయన ఆదేశాలను బట్టి ముందుకెళ్తాం’’ అని పేర్కొంది.