YS Sharmila : బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్ తీర్మానం చేసి పీఎం ముందు డిమాండ్ పెట్టారని, ఏపీకి హోదాపై సీఎం చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ తీర్మానం చేశారని పలువురు పేర్కొంటున్నారు. అయితే, ఏపీకి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలనే వాదన వినపడుతోంది. సీఎం చంద్రబాబు కూడా నితీశ్ లాగే ఎన్డీఏపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. తాజాగా ఆ వాదనతో జత కలిపారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.
మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే ఏపీ వెనకబడి ఉందని చంద్రబాబుకు తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. ‘‘ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేవా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పడం లేదు? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? అసలు ప్రత్యేక హోదాపై మీ వైఖరె ఏంటో చెప్పండి’’ అని షర్మిల ట్వీట్ చేశారు.