Babu Mohan : సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత కేఏ పాల్. ఇటీవలే బాబూమోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ పెద్దలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా బాబూమోహన్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనర్సింహ గెలిచారు. బాబూమోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.
బాబూమోహన్ 2014లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచిన విషయం తెలిసిందే. 2018లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 1990 దశకం నుంచి 2014 వరకు ఆయన టీడీపీలో పనిచేశారు. 1999 లో టీడీపీ నుంచి పోటీ చేసి అందోల్ లో గెలుపొందారు.
కాగా, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. బాబూమోహన్ పుట్టిన ఊరైన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో, సినిమాల్లో బాబూమోహన్ చేసిన సేవలు తెలియని వారంటూ ఉండరని కొనియాడారు. వరంగల్ ప్రజల సంపూర్ణ అభివృద్ధి కోసం ఎంపీ బరిలో నిలుచుంటున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి బాబూమోహన్ ను గెలిపించి బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.