Babu VS Jagan : బాబు భయపడుతున్నాడా? జగన్ ను భయపెడుతున్నాడా?

Babu VS Jagan

Babu VS Jagan

Babu VS Jagan : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలు మరింత రాటుదేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ఇటు వైసీపీకి అటు చంద్రబాబు, పవన్ లకు అత్యంత కీలకం. అందుకే ప్రతీ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఆ పరిధిలో ఏ వ్యూహాలు అనుసరించాలో ప్రత్యేకంగా రచిస్తున్నారు. సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా..పార్టీలో అభ్యర్థులకు ఏ ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకుల్లో విభేదాలను ముందే గుర్తించి వారిని ఐక్యంగా ఉంచడంలో పార్టీల అధిష్ఠానాలు చొరవ తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పటికే మూడు జాబితాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రత్యర్థుల కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. వారిని ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి వారి ఆదరణతో గెలిచి వస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యర్థుల కన్నా తాము ఎంతో ముందున్నామని, సీట్ల సర్దుబాటు, గొడవలు, విభేదాలను ముందుగానే పరిష్కరించుకుని.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించ వచ్చని జగన్ అండ్ కో నమ్ముతోంది. తమకు భయపడే బాబు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ-జనసేన సీట్ల వ్యవహారం తేలలేదని, టీడీపీలోనే ఇంకా క్లారిటీ రాలేదని.. కూటమిలో సీట్ల కొలిక్కి వచ్చే సరికి తమ అభ్యర్థుల ప్రచారం మొదటి రౌండ్ అయిపోతుందని అంటున్నారు. అభ్యర్థులను ప్రకటించడానికే భయపడే చంద్రబాబు ముందే ఓటమిని అంగీకరిస్తున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

అయితే దీనికి టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. రెండో సారి గెలవాలని సిట్టింగులను మారుస్తున్నారని, ఏదో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కానీ .. అది పెద్దగా వర్క్ వుట్ కాదని అంటున్నారు. చంద్రబాబు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారని, లేటు చేసేందుకు కూడా ఓ కారణముందని తద్వారా జగన్ కు ఓటమి తప్పదని చెబుతున్నారు. జగన్ పెట్టిన అభ్యర్థుల కంటే సమర్థులను, సామాజిక సమీకరణాలు, అంగ, ధన బలం, ప్రజల్లో పేరుప్రఖ్యాతులు ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారని.. ఇక వారిని ఎదుర్కొవడం జగన్ పార్టీ అభ్యర్థులకు సాధ్యం కాదని అంటున్నారు. జగన్ ముందే కోసిన కోకిల లాంటి వారని, చంద్రబాబు మాత్రం విజయాన్ని అందుకునే గెలుపు గుర్రమని అంటున్నారు. చంద్రబాబు బరిలోకి దింపే అభ్యర్థులను చూసి జగన్ భయపడిపోవడం ఖాయమని చెబుతున్నారు.

TAGS