Babu Schemes : బాబు పథకాలే ‘కూటమి’ పథకాలు..జనసేన, బీజేపీకి చాన్సే లేదు..!
Babu Schemes : మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. దీంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే జగన్ ‘సిద్ధం’ సభలతో హోరెత్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టాయి. పొత్తుల లెక్కలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. షరవేగంగా అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసి ప్రచారానికి సిద్ధం కాబోతున్నాయి.
ఎన్నికల్లో కీలకమైన మ్యానిఫెస్టో తయారీలో కూడా కూటమి పార్టీలు బిజీ అయ్యాయి. అయితే ఇందులో టీడీపీ గతంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు, బీసీ డిక్లరేషన్ వంటివే ఉండనున్నాయి. జనసేన సొంతంగా హామీ ఇచ్చిన షణ్ముక వ్యూహాన్ని పక్కకుపెట్టింది. ఇక బీజేపీ కూడా టీడీపీ మ్యానిఫెస్టోకే జై కొట్టే అవకాశాలు ఉన్నాయి.
కూటమిలో అధికార పగ్గాలు చేపట్టేది టీడీపీ. అందుకే ఆ పార్టీ ఇచ్చిన హామీలనే మ్యానిఫెస్టోగా అమలు చేసేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన వాటినే ఫాలో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ తమ పార్టీ సిద్ధాంతాలు, తాము ప్రజలకు ఇచ్చిన హామీలను మ్యానిఫెస్టో రూపంలో తెచ్చేందుకు పెద్దగా ప్రయత్నించే అవకాశాలు కనపడడం లేదు. మ్యానిఫెస్టోలో టీడీపీ హామీలనే చేర్చనున్నారు.
మరి దీనిపై జనసేన, బీజేపీ తమ శ్రేణులకు ఏం చెప్తాయో చూడాలి. అలాగే రేపు అధికారంలో వస్తే జనసేన, బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంటుందో భవిష్యత్ లోనే తెలియనుంది. ఇక పవన్ ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి పవన్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. మొత్తానికి టీడీపీ గొడుగు కిందనే జనసేన, బీజేపీ పనిచేయాలి తప్ప వేరే దారి కనపడడం లేదు.