Babu-Jagan : బాబు జగన్ నెత్తిన పాలుపోయాల్సిందే.. ఎందుకంటే?
Babu-Jagan : ఇటీవల ఏపీలో జరిగిన పార్లమెం ట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీవినీ ఎరుగని విజయం సాధించింది. రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఏపీకి ప్రధాన సమస్య రాజధాని నిర్మాణం. ఎన్నికల్లో విజయం సాధించగానే బాబు దృష్టి పెట్టింది రాజధాని నిర్మాణం పైనే. తన ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టకముందే చంద్రబాబు అమరావతి మీద ఫోకస్ పెట్టారు.
2014లో మొదలైనా..
2014లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించగా, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ కొత్త రాగం ఎత్తుకోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక్క రాజధానిని నిర్మించడమే కష్టం. అలాంటిది మూడు రాజధానులంటూ జగన్ కొత్త పాట ఎత్తుకోవడాన్ని ఏపీ ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. జగన్ ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిపై కక్షగట్టాడు. అమరావతే రాజధాని కావాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు రావడంతో కట్టడి చేసేందుకు అన్ని అస్ర్తాలను ఉపయోగించాడు జగన్. ఒక దశలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమూ చేశాడు. మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయంటూ వితండవాదం చేశాడు. దీంతో తమ సమయం కోసం వేచి చూసిన ఏపీ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో గట్టిగా దెబ్బ కొట్టారు. దీంతో ఏపీ ప్రజల ఆకాంక్ష తమ రాజధాని అమరావతేనని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఏపీ రాజధాని నిర్మాణానికి ఏ అడ్డూ లేకుండా ముందుకు సాగనుంది. అమరావతి నుంచి పాలనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సాగించేందుకు టీడీపీకి వీలవుతోంది.
అదే జగన్ చేసిన మేలు
రాజధాని విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం, టీడీపీకి లాభించాయి. జగన్ అధికారంలోకి సరైన ఆలోచనా విధానం లేకుండా మూడు రాజధానులంటూ ఏ పని చేయకపోవడంతో ప్రజలు విసుగెత్తి పోయారు. అదే చంద్రబాబుకి అనుకూలంగా మారింది. ఒకవేళ జగన్ తొందరపడి మూడు రాజధానుల నిర్మాణం చేపట్టి ఉంటే కూటమి ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు ఎదురయ్యేవి. ఏపీ ప్రజల అదృష్టం కొద్ది జగన్ ఏ పని మొదలు పెట్టకపోవడంతో మళ్లీ రాజధాని నిర్మాణ బాధ్యత చంద్రబాబు వద్దకే చేరింది.
తప్పుడు నిర్ణయాలు
పాలనాపరంగా ఏ రాష్ర్టానికైనా, దేశానికైనా ఒక రాజధానే సరైనది. మూడు చోట్ల రాజధానులు నిర్మించిన చరిత్ర ఎక్కడా లేదు. రాజధాని నిర్మానాణికి ప్రధాన సమస్యలు భూమి, ఆర్థిక వనరులు. ఆర్థిక వనరులున్నా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున భూమి కావాల్సి ఉంటుంది. భూమి ఉన్నా అక్కడి భౌగోళిక పరిస్థితులు భవనాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు యోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కుదిరితే గానీ రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. ఈ తప్పుడు నిర్ణయాలే జగన్ ను భ్రష్టు పట్టించడంతో పాటు రాష్ర్ట ప్రజలకు శాపంగా మారింది. ఇవన్నీ వెరసి జగన్ పరిపాలనరాహిత్యం, అనుభవలేమి ప్రజలకు అర్థమైంది. పరిపాలనలో అనుభవం ఉన్న బాబు వస్తేనే బాగుపడతామని ఏపీ ప్రజలు తమ తీర్పుతో స్పష్టం చేశారు. బాబు వైసీపీ మీద చేసిన విమర్శల కన్నా జగన్ చేజేతులా చేసుకున్న నష్టమే ఎక్కువ. ఇలా తప్పుడు నిర్ణయాలతో చంద్రబాబుకు పరిపాలనా పగ్గాలు అప్పజెప్పేలా చేశాడు జగన్. ఇందుకైనా బాబు జగన్ కు థ్యాంక్స్ చెప్పాల్సిందే.