Chandrababu : హ్యాట్రిక్ పక్కా అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, ఉద్యోగుల సహకారంతో కాంగ్రెస్ కూలదోసి అధికారంలోకి వచ్చింది. వచ్చిందే తడవుగా ఓ వైపు ఆరు గ్యారెంటీలకు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు చేస్తూనే మరో వైపు తెలంగాణలో ‘కేసీఆర్’ ఛాయలు లేకుండా చేసే దిశగా ప్రయత్నం చేస్తోంది. అందుకే కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకునే ‘కాళేశ్వరం’ లొసుగులను బయటకు తీసి కేసీఆర్ పనితీరును జనాలకు కళ్లకు కట్టాలని చూస్తోంది.
ఈక్రమంలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జలజగడం మొదలైంది. ఇవాళ కృష్ణా ప్రాజెక్టులు నిజనిజాలను ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ పెడితే. . ‘కాళేశ్వరంలో కంతలు’లను జనాలకు చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార గణమంతా కాళేశ్వరం ట్రిప్పు పెట్టుకుంది. రాజకీయంగా ఇంత హడావిడిగా ఉంది. ఇక అసెంబ్లీలో కూడా మొత్తం ‘వాటర్ వారే’ నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్న వేళ మధ్యలో చంద్రబాబు పేరు కూడా పలుసార్లు రాజకీయ నాయకుల నోట్లో నానుతుందనే చెప్పాలి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రే చంద్రబాబుకు ప్రియశిష్యుడు. ఇక మంత్రివర్గంలోనూ అక్కడక్కడ చంద్రబాబు శిష్యులు ఉన్నారనే చెప్పాలి. కాంగ్రెస్ పరిపాలిస్తున్న తెలంగాణ జనాలకు తెలియకుండా ‘చంద్రబాబు’ చాణక్యం రేవంత్ ద్వారా పనిచేస్తోందనే విషయం రాజకీయ వర్గాలకు తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు. ఒకప్పుడు కరీంనగర్ తెలంగాణ వాదులపైకి గన్ను తీసుకెళ్లినా రేవంత్ రెడ్డి.. తదనంతర కాలంలో రాజకీయాల్లో నెగ్గాలంటే తెలంగాణ పాట పాడక తప్పదని తెలుసుకుని ఆ మేరకు నడుచుకుంటున్నాడు. ఇక సీఎం అయిన దగ్గర నుంచి మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు.
అయితే తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై వాడీవేడి చర్చ నడుస్తుండగా.. ఈ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని పలువురు మంత్రులు మాట్లాడారు. మంత్రి జూపల్లి కూడా మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కు , ఏపీ సీఎం జగన్ కు ఉన్న దోస్తానాను బయటపెట్టారు. కృష్ణా జలాల సాధనలో కచ్చితంగా వ్యవహరించకుండా కేంద్రం మోకాలిల్లారని ఆరోపించారు. ఇక చంద్రబాబు అంటే కేసీఆర్ కు రాజకీయంగా సరిపడదని.. ఆయన రెండో సారి సీఎం కాకూడదని కేసీఆర్ కోరుకున్నారని.. అందుకే ఏపీ ఎన్నికల్లో జగన్ రెడ్డికి సహకరించారని జూపల్లి చెప్పుకొచ్చారు. ఇలా రేవంత్ దళంలోని చాలా మంది నిత్యం ఏదో సందర్భంగా చంద్రబాబు ప్రస్తావన తెస్తూనే ఉన్నారు.