Revanth : బాహుబలి పంపులు స్టార్ట్.. కేసీఆర్ గొప్పతనాన్ని రేవంత్ ఒప్పుకున్నట్టేనా

Revanth

Revanth

Revanth : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్‌ అయ్యాయి. ప్రభుత్వం నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంప్‌హౌస్‌లోని నాలుగు మోటార్లు ఆన్ చేసి 13,076 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ నీటిని గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఆగస్టు 2వ తేదీలోగా పంపులు ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో కన్నెపల్లికి చేరుకుని పంపులు ఆన్ చేస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అల్టిమేటం జారీ చేసింది. వెంటనే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

రెండు మూడు రోజుల్లో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తామని ప్రకటించారు. 24 గంటలు గడవకముందే నందిమేడారం (నంది) పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ అయ్యాయి. తొలుత రెండు మోటార్లు ఆన్ చేసి 6,538 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసిన అధికారులు శనివారం సాయంత్రం మరో రెండు మోటార్లు ఆన్ చేసి నాలుగు మోటార్ల ద్వారా జంట టన్నెల్స్ ద్వారా మొత్తం 13,076 క్యూసెక్కుల నీటిని లక్ష్మీపూర్ (గాయత్రి) పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. లక్ష్మీపూర్ (గాయత్రి) పంప్ హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మోటారు ఆన్ చేసి 3,266 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. సాయంత్రం మరో మోటారు ఆన్ చేసి రెండు మోటార్ల ద్వారా సుమారు 7000 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువకు, అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తున్నారు.

ఈ రెండు పంప్ హౌస్‌ల నుంచి క్రమంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యామ్‌లకు నీరు ఇచ్చి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లకు నీటిని ఎత్తిపోస్తారు.

శ్రీపాద ఎల్లంపల్లిలో 17 టీఎంసీల నీటిమట్టం
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో వారం రోజుల క్రితం 6 టీఎంసీల నీరు 17 టీఎంసీలకు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా వారం రోజుల్లో 10 టీఎంసీల నీరు వచ్చింది. ఎల్లంపల్లికి ప్రస్తుతం 13,659 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎత్తిపోతల నిమిత్తం ఇక్కడి నుంచి 6,631 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నిండేందుకు సిద్ధంగా ఉన్నందున ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి నుంచి లిఫ్టులు ప్రారంభమయ్యాయి.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చే వరద నీటిని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా పైకి ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఎన్డీఎస్ఏ అనుమతి ఇస్తే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోస్తామని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ గేట్లను దించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయాలంటే నదిలో నిర్దేశిత నీటిమట్టం ఉండాలని చెబుతున్నారు. యాసంగి సీజన్ వరకు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, అప్పటి వరకు నీటి అవసరాన్ని బట్టి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తామని అధికారులు చెబుతున్నారు.

TAGS