JAISW News Telugu

B-21 Raider : బీ-21 స్టెల్త్ బాంబర్.. అమెరికా రక్షణదళంలోకి కొత్త యుద్ధ విమానం..

B-21 Raider

B-21 Raider

B-21 Raider : ప్రపంచం యుద్ధమేఘాల మధ్య బిక్కుబిక్కుమంటోంది. ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరో వైపు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్-హమాస్ పోరు సాగుతోంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో అణుబాంబు హెచ్చరికలు సర్వసాధారణమైపోయాయి. తమ ఉనికికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే అణ్వాస్త్రాల ప్రయోగానికి వెనకాడబోమని రష్యా, ఇరాన్ హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రెండు యుద్ధాల్లో అగ్రరాజ్యం అమెరికా తమ మిత్రపక్షాల మధ్య నిలబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది.

అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బీ-21 రైడర్ యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో అమెరికా తొలిసారిగా పరీక్షించింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పటి ఫొటోలు అవి. రాడార్ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం దొరకకుండా ఎగరగలిగే ‘స్టెల్త్ బాంబర్’ కావడం గమనార్హం.

అమెరికా వాయుసేనకు వెన్నముఖగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది అమెరికా అమ్ములపొదిలో చేరే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తుతానికి దీని ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని సదరు అధికారులు చెబుతున్నారు. ఇది సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. దక్షిణ డకోటాలోని ఎల్స్ వర్త్ వైమానిక స్థావరంలో వీటిని ఉంచుతారట. మిస్సౌరిలోని వైట్ మైన్, టెక్సాస్ లోని డైస్ వైమానిక స్థావరాలు బ్యాకప్ కేంద్రాలుగా ఉండనున్నాయి.

Exit mobile version