Ayyannapatrudu : ఆంధ్రప్రదేశ్ లో నిన్న అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఈ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) శుక్రవారం (జూన్ 21) అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన పేరునే ప్రకటించారు. ఈ రోజు శనివారం (జూన్ 22) స్పీకర్ ను చైర్ లో కూర్చోబెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఆ తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడి గొప్పతనాన్ని వివరించారు. తన మామ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో యువతరం రాజకీయాల్లోకి రావాలని పిలుపుతో అయ్యన్నపాత్రుడు అప్పుడు వచ్చారని, అప్పుడు ఆయన వయస్సు కేవలం 22 మాత్రమే అని గుర్తు చేశారు. ఇప్పటికి ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఒక సారి పార్లమెంట్ కు కూడా వెళ్లాడని చెప్పారు.
అయ్యన్నపాత్రుడి అనుభవాలు తమకు అందజేయాలని ఆయన సలహాలు, సూచనలతో ప్రభుత్వాన్ని నడుపుతామని హౌజ్ ఆఫ్ ద లీడర్ చంద్రబాబు అన్నారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను భుజాల నుంచి దింపలేదని, పార్టీని కన్నతల్లిగా చూశారని, పోరాట యోధుడని అన్నారు. ఉత్తరాంధ్రకు నీరు కావాలని కొట్లాడి ప్రజల దాహార్తిని తీర్చిన గొప్ప నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడన్నారు.
జగన్ పాలనలో అయ్యన్నపాత్రుడిపై పాశవికంగా ప్రవర్తించారన్న చంద్రబాబు నాయుడు ఆయన పట్ల వ్యవహరించిన తీరును సభకు వివరించారు. ఆయనపై అక్రమ కేసులు, ఆయన ఇంటిపై దాడులను వివరించారు. చట్టసభల వివలు తెలిసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలుస్తుందని, సభ హుందాగా నడుతారని నమ్ముతానని చంద్రబాబు చెప్పారు.