Ayyannapatrudu : ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu : ఏపీ శాసనసభ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇది ఏడోసారి. ఇటీవల మంత్రివర్గ ఏర్పాటులోనే ఆయనకు బెర్తు లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా అవకాశం దక్కలేదు. దరిమిలా స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. స్పీకర్ పదవిని కోరుతూ ఒకరిద్దరూ సీనియర్లు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడగా, ఆయ్యన్నను ఎంపిక చేస్తున్నట్లు ఆయన వారికి తెలిపారు.
శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. అయ్యన్నపాత్రుడు సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.