Muslim Devotees : అందరివాడు అయోధ్య రాముడు.. లక్నో నుంచి కాలినడకన వచ్చిన ముస్లిం భక్తులు
Muslim Devotees : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతున్నాయి. దేశంలో ఎన్నో అల్లర్లకు, గొడవలకు కారణమైన బాబ్రీ, రామాలయ వివాదం సుఖాంతం కావడం అన్ని వర్గాలకు ఆనందాన్ని ఇచ్చింది. దేశంలో శాంతివీచికలు వీస్తున్నాయి. రామ్ లల్లాను చూసి తరించడానికి మతాలకు అతీతంగా భక్తులు తరలివస్తున్నారు.
రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు కూడా తరలివస్తుండడం విశేషం. తాజాగా లక్నో నుంచి 350మంది ముస్లింలు రామయ్య దర్శనం కోసం గురువారం అయోధ్యకు చేరుకున్నారు.
‘‘భగవాన్ శ్రీ రాముడు మన పూర్వీకుడు .. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని బోధించదు’’ అని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.
రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయల్దేరింది. ముస్లింల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది. చలిలో 150 కిలోమీటర్లు కాలినడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం. ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించుకొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమగ్రతను కాపాడుతుంది.’’ అని వారు తెలిపారు.
ఇలా అయోధ్య కులమతాలకు అతీతంగా దేశంలో ఒక అధ్భుత ప్రాంతంగా మారుతోంది. ‘దేశ ఆధ్యాత్మిక ఆత్మ’గా రూపొందుతోంది. అయోధ్య రామాలయంతో ఉత్తరప్రదేశ్ రాత, భవిత మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో చెప్పినట్టుగా అయోధ్య రామాలయంతో దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివెరియడమే కాక ప్రజలు అష్టఐశ్వర్యాలతో తులతూగేందుకు మరెన్నో సంవత్సరాలు పట్టదు.