Ayodhya Rama Mandir: అయోధ్య బాల రాముడి మందిరానికి ఇంకా కోట్లాది రూపాయలు చందాలుగా వస్తూనే ఉన్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటు తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి భవ్య మందిరం కోసం విరాళాలు సమర్పించారు. దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా విరాళాలు ప్రవాహంలా వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ట్రస్ట్ రామ్ లల్లాకు దివ్య, భవ్య మందిరాన్ని నిర్మించింది. ప్రాణ ప్రతిష్ట తర్వాత కూడా విరాళాల ప్రవాహం ఆగడం లేదు. ఏదో ఒక మూల, ఎవరో ఒకరు ట్రస్ట్ పేరిట పంపిస్తూనే ఉన్నారు. ఇటీవల ట్రస్ట్ పేరిట ఒక చెక్కు వచ్చింది. ఇది చూసిన ట్రస్ట్ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు రూ. 2,100 కోట్ల చెక్కు వచ్చింది. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంపిన దాత చెక్కుపై తన పేరు, మొబైల్ నెంబర్, చిరునామా రాశారు. ఇక్కడే మెలిక పెట్టాడు. చెక్కును ప్రధానమంత్రి సహాయనిధి పేరు మీద శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు పోస్టులో పంపాడు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ చెక్కు ఆఫీస్ కు వచ్చిందని, దీన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని ట్రస్టుకు సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.
ఆలయ ఖాతాలో రూ. 2,600 కోట్లు
శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేరుతో బ్యాంకు ఖాతాలో రూ.2,600 కోట్లు ఎఫ్డీల రూపంలో ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మందిరం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఏర్పాటులో ఈ విషయాలను వివరిస్తామని ఆయన వెల్లడించారు.