JAISW News Telugu

Ayodhya Prasadam : అయోధ్య ప్రసాదం పేరుతో నకిలీ అమ్మకాలు.. అమేజాన్ కు నోటీసులు జారీ చేసిన కేంద్రం

Ayodhya Prasadam

Ayodhya Prasadam

Ayodhya Prasadam : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే గడువు ఉంది. దీంతో దేశం మొత్తం ఆ మహోత్తరమైన ఘట్టం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు సైబర్ నేరగాళ్లు రామ మందిర నిర్మాణానికి చెందాలు, విరాళాలు అంటూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటివి నమ్మవద్దని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ దేశ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది.

ఇటీవల అమేజాన్ లో సైతం ఇలాంటి అమ్మకాలు చేపడుతున్నారని తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘అయోధ్య ప్రసాదం’ పేరుతో మిఠాయిలను అమ్ముతోందని ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

రామ ప్రసాదం పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తూ కస్టమర్లను అమేజాన్ తప్పుదోవ పట్టిస్తోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. శ్రీరామ మందిర్, అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రఘుపతి నెయ్యి లడ్డూ, దేవీ ఆవు పాలు, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌ ఇలా మరి కొన్నింటిని అమ్ముతున్నట్లు అందులో పేర్కొంది. దీనిపై స్పందించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది.

దీనిపై వారంలో వివరణ ఇవ్వాలని గడువు విధించింది. లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆరోపణలపై అమేజాన్ ప్రతినిధి స్పందించారు. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న విక్రేతలపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు రామ మందిర పేరిట ఉత్పత్తుల సేల్స్‌ ఆప్షన్‌ను తొలగించినట్లు వెల్లడించారు.

Exit mobile version