AV Ranganath : మల్టీ జోన్-1 ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితమైన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పోస్టును అప్‌గ్రేడ్ చేసి హెచ్‌ఎండీఏ పరిధికి విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్‌గా రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉంటుంది. ఇదిలా ఉండగా, కమాండ్ కంట్రోల్ రూమ్ (బంజారాహిల్స్) కేంద్రంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో కబ్జాలపై ఉక్కుపాదం మోపే బాధ్యతను ఐజీ రంగనాథ్ తీసుకోనున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ విభాగం బంజారాహిల్స్‌లో అసర్ట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేరుతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుంది. రంగనాథ్ నేతృత్వంలో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్సీలను పోలీసు శాఖ నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోనున్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణలో ఈ విభాగం కీలకం కానుంది. గతంలో వివిధ శాఖలను సమర్థంగా నిర్వహించిన రంగనాధ్ ఈవీడీఎం కమిషనర్ గా మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు.
యూబ్లడ్ కు మద్దతుగా నిలిచిన రంగనాథ్..
ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న యూబ్లడ్ ఫౌండేషన్ కు మద్దతుగా ఏవీ రంగనాథ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సేవాగుణం, పరిపాలన దక్షణ, సమర్థత ఉన్న రంగనాథ్ మున్ముందు మరింత ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో మరింత పేరు తెచ్చుకోవాలని యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారు ఆకాంక్షించారు.