Chandrababu : గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీ రాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచనలో చేస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం. భూముల అంశంలో, రెవెన్యూ నిర్ణయాల్లో మాజీ సీఎం జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుసక్తాలను ఇవ్వాలని నిర్ణయించగా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం పక్కన బెట్టనుంది. ఎవరి పని వాళ్లే చేయాలి.. గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయడమేంటి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
భూములకు సంబంధించిన రికార్డులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉంటాయని, అక్కడే రిజిస్ట్రేషన్లు చేస్తేనే దానికి విలువ ఉంటుందన్నారు. గత ప్రభుత్వం భూముల విలువ సవరించే ప్రతిపాదనలోనూ తప్పుల తడకగా చేసిందన్నారు ముఖ్యమంత్రి. ఒక నిర్దిష్ట విధానం లేకుండా భూముల విలువలను ఒక్కోరకంగా సవరించారని.. దీంతో మార్కెట్ విలువ పెంపుదల గందరగోళం ఏర్పడిందన్నారు. వెంనటే ఆ విధానానికి స్వస్తి పలకాలని.. సమగ్రంగా అధ్యయనం చేసి కొత్త మార్కెట్ రేట్ల ప్రతిపాదనను తీసుకురావాలని ఆ శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. అవినీతికి ఆస్కారం ఉండటంతో పాటు అతి తక్కువ రెస్పాన్స్ ఉన్నందున పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు.అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వెంటనే 10కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.