Sexual Harassment : వివాహితపై లైంగిక దాడికి యత్నం.. వైసీపీ నాయకుడి దాష్టీకం..

Sexual Harassment
Sexual Harassment : అధికారం ఉందనే అహంకారం.. తామేం చేసినా చెల్లుతుంది అనే గర్వం..తమనెవరూ శిక్షించలేరు అనే కండకావరం..అమాయకులపై దాడులు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు..ఇవన్నీ సహజమైపోయాయి. ఇలాంటి సంఘటనే తాజాగా అనంతపురం జిల్లాలో జరిగింది. ఓ వివాహితపై పట్టపగలే వైసీపీ నాయకుడు అత్యాచార యత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాలవెంకటాపురంలో బట్టల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం దుకాణం మూసివేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక వైసీపీ నాయకుడు, గ్రామ సచివాలయం కన్వీనర్ నటరాజ్ ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. జట్టు పట్టుకుని ఈడ్చి.. కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు.
పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు అక్కడికి చేరుకుని ఆమెను విడిపించడానికి ప్రయత్నించాడు. అతడిపైనా నటరాజ్ దాడి చేశాడు. కొద్దిసేపటికి మరి కొంతమంది అక్కడకు చేరుకోవడంతో నటరాజ్ పరారయ్యాడు. బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహితపై దాడి దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు నటరాజ్ పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అతడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ అనుచరుడు. బరితెగించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.