Fiber Net Case : ఎన్నికల వేళ చంద్రబాబును ఇరుకున పెట్టే యత్నం..ఫైబర్ నెట్ కేసులో ఏ1గా..
Fiber Net Case : ఏపీలో అంతా ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకునపెట్టేలా వైసీపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరగకుండా చేసేందుకు మరో కేసులో ఏ 1గా ఇరికించింది.
ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చంద్రబాబును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) ప్రధాన నిందితుడు ఏ-1గా పేర్కొంది. ఈమేరకు సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడితో పాటు హైదరాబాద్ లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి హరికృష్ణప్రసాద్, ఐఆర్ టీఎస్ అధికారి కె.సాంబశివరావులను ఇతర నిందితులుగా పేర్కొంది.
2015 లో టీడీపీ హయాంలో రూ.330 కోట్లతో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ను చంద్రబాబు తనకు అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ల ప్రక్రియలో అవతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
‘‘అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి శాఖల పోర్ట్ ఫోలియోను కలిగి ఉన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని ఆయన వ్యక్తిగతంగా సిఫార్సు చేశారు..’’ అని సీఐడీ పేర్కొంది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఐటీ శాఖకు బదులుగా ఎనర్జీ ఐ అండ్ ఐ డిపార్ట్ మెంట్ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు వ్యక్తిగతంగా సిఫార్సు చేశారని తెలిపింది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు నేర నేపథ్యం ఉన్నప్పటికీ.. ఆయన గవర్నింగ్ కౌన్సిల్ గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా నియమించారని పేర్కొంది.
‘‘ఏపీ ఫైబర్ గ్రిడ్ ఫేజ్-1 కాంట్రాక్ట్ ను అమలు చేసిన సమయంలో జరిగిన ఫిరాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.114 కోట్ల నష్టం వాటిల్లింది. ఖరీదైన ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులు, 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ కారణంగా ఆదాయాన్ని కోల్పోవడం వల్ల మరింత నష్టాలు సంభవిస్తాయి. నిందితుడు తమ అసొసియేట్ లకు చెందిన కంపెనీల వెబ్ ద్వారా నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు’ అని ఏపీ సీఐడీ ఆరోపించింది.
అయితే ఎన్నికల ముందు చంద్రబాబుపై ఫైబర్ కేసును ముందుకుతేవడం రాజకీయ కోణం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబును మానసికంగా దెబ్బతీసి తద్వారా లబ్ధి పొందే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.