Chandrababu : వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, టీడీపీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్ లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన ప్రజారంజకంగా ఉండాలని, స్వార్థం కోసం దోపిడీ చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు.
టీడీపీ హయాంలో ఉర్దూ వర్సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హజ్ హౌజ్ నిర్మించి పలువురిని మక్కా పంపించామని, కడప, విజయవాడలో హజ్ హౌస్ లు నిర్మించామని, రూ. 8 కోట్లు ఖర్చుపెట్టి షాదీ మంజి కట్టించినట్లు వెల్లడించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క భవనమైనా కట్టించారా..? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర వ్యాప్తం చేశామని, అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు.