YS Jagan : జగన్ పై దాడి.. స్పందించిన చెల్లి షర్మిల..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలకు తీవ్రమైన గాయమైంది. శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన జరిగింది. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు మూడు కుట్లు వేసి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సు యాత్ర రద్దు అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్సు యాత్ర చేరుకుంది. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ నుంచి వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల క్యాట్ బాల్ తో రాళ్లదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక చికిత్స అందించారు డాక్టర్లు. రాయి లోతుగా దిగిందని అందుకే మూడు కుట్లు వేసినట్లు ప్రకటించారు. డాక్టర్ల సూచన మేరకు ఇవాళ విశ్రాంతి తీసుకోనున్నారు. సీఎం జగన్ చికిత్స తర్వాత కేసరపల్లికి చేరుకున్నారు. సీఎం జగన్ పై దాడిపై ఎన్నికల ప్రధాన అధికారి స్పందించారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని, రేపటి లోగా ఘటనకు గల కారణాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి.
అన్న జగన్ పై దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ ఎడమ కంటికి గాయం కావడం బాధాకరమన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నా.. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్..సీఎం జగన్ పై రాళ్ల దాడి జరగడాన్ని ఖండించారు. సీఎం జగన్ క్షేమంగా ఉన్నందుకు సంతోషం అన్నారు. జాగ్రత్త జగన్ అన్న అని సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. దీనిపై ఈసీ కఠిన చర్యలు చేపట్టాలని ట్వీట్ చేశారు.