Iran-Israel : యూదు దేశం ఇజ్రాయెల్ పై ఇరాన్ క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పై సుమారు 200లకు పైగా క్షిపణులతో దాడి చేసింది. ఈమేరకు ఇజ్రాయెల్ రక్షణ విభాగం అధికార ప్రతినిధి డానియెల్ హగరీ మీడియాకు వెల్లడించారు. ఉదయం రెండు గంటలకు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, జెరూసలేం, దిమోనా, ఇజ్రాయెల్ న్యూక్లియర్ రియాక్టర్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందన్నారు. ఆ క్షిపణుల్లో కొన్నింటిని ఐడీఎఫ్ ద్వారా అడ్డుకున్నట్లు హగరీ వెల్లడించారు.
రెండు వారాల కింద సిరియాలోని కాన్సూలేట్ పై ఇజ్రాయెల్ దాడులు చేసి ఇరాన్ మేజర్ జనరల్ కమాండర్ మహమ్మద్ రెజా జహేదితో సహా ఏడుగురు ఇరాన్ దేశీయులను హతమార్చింది.
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. నేరాలకు పాల్పడుతున్న జియోనిస్ట్ దేశంపై ఇది ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ దాడులను అభివర్ణించింది. డెమాస్కస్ పై దాడికి ప్రతీకారంగానే తాము క్షిపణి దాడులకు పాల్పడినట్టు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము చేసిన దాడులపై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ లేదా అమెరికా తమ దేశంపై దాడికి దిగే అవకాశం ఉందని కూడా తెలిపింది.
ఇజ్రాయెల్ పై దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.