JAISW News Telugu

medical college : మెడికల్ కాలేజీలో దారుణం.. 10 మంది సజీవ దహనానికి కారణమెంటో తెలుసా?

medical college : ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దవాఖానలోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 10 మంది సజీవదహనమైనట్లు సమాచారం. మరో 16 మంది తీవ్ర గాయాల బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనటల్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ర్టేట్ ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో ఈ విభాగంలో సుమారు 30 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ఇక పది మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇక ఝూన్సీ కమిషనర్ బిమల్ కుమార్ దుబే, ఎస్ ఎస్పీ సుధాసింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైద్య చికిత్స కోసం పిల్లలను వైద్యశాలకు తీసుకు వస్తే తమ పిల్లలను కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఒక తల్లి మాట్లాడుతూ ఉదయమే తనకు బిడ్డ పుట్టిందని అంతలోనే కన్నుమూసిందని రోదిస్తూ చెప్పింది.  సిబ్బంది నిర్లక్ష్యంపై ఆమె తీవ్ర కలత చెందింది.
ఇక ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. వెంటనేవిచారణకు ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఘటనాస్థలానికి వెంటనే చేరుకోవాలని జిల్లా యంత్రాగాన్ని ఆయన వెంటనే ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఝాన్సీకి చేరుకున్నారు. దవాఖానలో సేఫ్టీడ్రిల్ కూడా ఇటీవల నిర్వహించామని , అయితే ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని అధికారులు తెలిపారు. ఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 12 గంటల్లో తమకు పూర్తిగా నివేదిక అందించాలని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version