JAISW News Telugu

Secunderabad : సికింద్రాబాద్ లో దారుణం.. ఆయువు పోసే చెట్టే  ప్రాణం తీసింది

Secunderabad

Secunderabad : చెట్టు మానవాళికి జీవనాధారం. చెట్టు ప్రాణవాయువు ఇచ్చి జీవితాలను నిలబెడుతుంది అని అందరికీ తెలుసు. అదే చెట్టు  నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన మంగళవారం సికింద్రాబాద్‌ పరిధిలో చోటు చేసుకుంది. భార్య కాలినొప్పితో బాధపడుతుండటంతో డాక్టర్ కు చూపించేందుకు  తీసుకెళ్తున్న భర్తను ఓ చెట్టు రెప్పపాటులో బలి తీసుకుంది. అప్పటి దాకా వారి కోసమే కాచుకుని కూర్చుందా అన్నట్లు స్కూటీపై వారు ఆస్పత్రి ఆవరణలోకి రాగానే ఒక్క సారిగా వారిపై పడింది. ఈ ఘటనలో భార్యకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.  

సరిగ్గా నెల రోజుల క్రితమే ఎండిపోయిన ఆ చెట్టును తొలగించి ఉంటే ఒకరి ప్రాణాలు పోయేవి కాదని..  కనీసం ఇటీవల వర్షాలకు మొదళ్లు పెకలించుకుని వచ్చినప్పుడైనా స్పందించి ఉంటే ఆ మహిళకు ఇంతటి శోకం మిగిలేది కాదని అక్కడున్న వారంతా చెప్పుకుంటున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటలోని తూంకుంట పట్టణంలో నివసించే సరళాదేవి బొల్లారంలోని త్రిశూల్‌ పార్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. ఆమె కాలినొప్పికి చికిత్స నిమిత్తం తన భర్త రవీంద్ర(52)తో కలిసి స్కూటీ పై కంటోన్మెంట్‌ ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా పక్కనున్న చెట్టు కుప్పకూలింది. రవీంద్ర ఛాతీపై కాండం పడటంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

ఆయన తన వెనుకున్న సరళాదేవి మీద పడటంతో ఆమె నేలపైపడ్డారు. దీంతో తల, వెన్నుపూస, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొద్ది క్షణాల ముందు అదే చెట్టు కింద నుంచి వచ్చిన వారు ఈ ఘటనను చూసి ఒక్కసారి బతుకుజీవుడా అంటూ వణికిపోయారు. భర్త చనిపోయిన విషయం తెలియక ఆసుపత్రిలో ఆయన క్షేమ సమాచారాన్ని అడుగుతున్న సరళాదేవి పరిస్థితిని చూసి బంధువులు, తోటి టీచర్లు కన్నీటి పర్యంతమయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.  వెంటనే ఆసుపత్రిలోని ప్రమాదకరంగా ఉన్న చెట్లను నరికే వేయాలని ఆదేశించారు.

Exit mobile version