Atma Sakshi Survey : నెల్లూరు జిల్లాలో హోరాహోరీ..ఆత్మసాక్షి సర్వే..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
Atma Sakshi Survey : ఏపీలో ఎన్నికల కాక మొదలైంది. ఇప్పటికే వైసీపీ జాబితాల మీద జాబితాలు ప్రకటించుకుంటూ వెళ్తోంది. సిద్ధం పేరుతో జగన్ సభలు పెట్టి కార్యకర్తలు, నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు నడుస్తోంది. త్వరలోనే సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జగన్ రెడ్డిని గద్దె దించడానికి ఇరు పార్టీలు కంకణం కట్టుకున్నాయి. పొత్తు కోసం ఓ మెట్టు దిగాలని కూడా అవి భావిస్తున్నాయి. ఏదేమైనా గెలుపే వాటి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈక్రమంలో జనాల్లో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. దీంతో పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడీ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు వైసీపీకి, కొన్ని సర్వేలు టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా.. రేపు ఓటరు తీర్పే ఫైనల్. ఈ సర్వేలు ఓ ముందస్తు అంచనా మాత్రమే. తాజాగా ఆత్మసాక్షి సర్వే సంస్థ తన నివేదిక వెల్లడించింది. ఈ సర్వే నివేదిక గతంలో దేశంలోనూ, తెలంగాణలోనూ విఫలమైందనే చెప్పాలి. అయినా కూడా మరో ప్రయత్నం చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో వెల్లడించింది.
ఈ సర్వే అంచనా ప్రకారం..
నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికార వైసీపీ దుమ్మురేపుతుందని సర్వే చెబుతోంది. వైసీపీ ఆరు స్థానాల్లో, టీడీపీ, జనసేన కూటమి 4 స్థానాల్లో సత్తా చాటుతాయని అంటోంది.
టీడీపీ విజయం సాధించే నియోజకవర్గాలు:
1. నెల్లూరు రూరల్
2. నెల్లూరు సిటీ
3. గూడూరు
4. వెంకటగిరి
వైసీపీ విజయం సాధించే నియోజకవర్గాలు:
1. సర్వేపల్లి
2. కొవ్వూరు
3. సూళ్లూరుపేట
4. ఆత్మకూరు
5. కావలి
6. ఉదయగిరి
అయితే అందరూ అంచనా వేస్తున్నట్టుగా నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి వర్సెస్ వైసీపీ .. పోటీ రసవత్తరంగానే ఉండబోతున్నట్టు సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. మొత్తం 10 సీట్లలో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయి. సర్వే ఫలితాలు ఎలా ఉన్నా..ఓటరు ఎటు మొగ్గుచూపుతాడో అన్నది కీలకం. రాబోయే రెండు నెలల్లో ఏ పార్టీ మరింత పుంజుకుంటుంది.. ఏ పార్టీ బలహీనం అవుతుంది అనేది తెలియదు. ఈక్రమంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ఓటరును ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఈ సర్వే ప్రకారం వైసీపీకి మెజార్టీ స్థానాలు వస్తున్నా.. టీడీపీ, జనసేన కూటమి కూడా వైసీపీకి దీటుగానే సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.