Atchannaidu : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నోటిఫికేషన్ ఈనెల రెండో వారం తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెంచుతున్నాయి. మొన్నటిదాక టీడీపీతో పొత్తు పెట్టుకున్న తమ మిత్రుడు పవన్ కల్యాణ్ విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించిన బీజేపీ.. ఇప్పుడు ఆయన మిత్రుడు చంద్రబాబును అక్కున చేర్చుకునేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే పొత్తుల విషయం మాట్లాడుకుందాం రమ్మంటూ చంద్రబాబును ఢిల్లీకి పిలిచింది. దీంతో చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.
మరి ఢిల్లీలో చంద్రబాబు వారితో ఏం మాట్లాడారు? ఏం చర్చించారు అనేది ఇంతవరకు బయటకు రాలేదు. కానీ ఇవాళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అచ్చెన్న చెప్పారు. యితే వీరి భేటీలో ఏం జరిగిందో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు స్వయంగా చెబుతారని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనమే తమకు ముఖ్యమని చెప్పారు.
మరో వైపు ఇవాళ పవన్ కల్యాణ్ కు కూడా ఢిల్లీ రావాలని ఆహ్వానం అందింది. దీంతో చంద్రబాబు, పవన్ తో మరోసారి అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమై పొత్తు, సీట్ల సర్దుబాటును ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్లే. ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల్లో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాలపై దాదాపు క్లారిటీ వచ్చింది. అయితే బీజేపీ కూడా చేరుతున్నందున వారికి కేటాయించే సీట్లను కూడా కలిపి ఒకేసారి ప్రకటించబోతున్నారు.