Civils 2nd Rank : నిన్న సివిల్స్ ఫలితాలు వచ్చాయి. అందులో ఎంతో మంది పేద, మధ్య తరగతి బిడ్డలే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొడి నిలిచి గెలిచారు. సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనకు ఎదురైన కష్టాలు వింటే ఎవరైనా కన్నీరు కార్చాల్సిందే..
ఒడిశాలోని అనుగుల్ జిల్లాలోని తాల్చేర్ కు చెందిన అనిమేశ్.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ‘‘2022లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా.. సోషియాలజీని ఆప్షనల్ గా ఎంచుకున్నా.. రోజుకు 5-6 గంటల పాటు చదివా..పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు.’’ అని చెప్పాడు.
సివిల్స్ రిజల్ట్స్ విషయంలో చాలా సంతృప్తిగా ఉందని, తన కల నెరవేరిందని తెలిపాడు. ఇందుకు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాడు. గత నెలలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అమ్మను కోల్పోయానని, 2015లో నాన్న మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా..వారు లేని లోటు పూడ్చలేనిది బాధపడ్డారు.
ఐఏఎస్ కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని, ఒడిశా క్యాడర్ ఆశిస్తున్నట్లు అనిమేశ్ చెప్పారు. ‘‘నా రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటున్నా..’’ అని వివరించారు. పార్లమెంటరీ డిబేటింగ్, మీడియా అడ్వకసీ-జర్నలిజం, ఫ్రీ స్టైల్ డ్యాన్స్ తన హాబీలు అని చెప్పుకొచ్చాడు.
కాగా, సివిల్స్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే కష్టపడే గుణంతో పాటు మానసిక దృఢత్వం అవసరం. ఎలాంటి ఘటనలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడే తత్వం అవసరం. విజయం, అపజయాన్ని సమానంగా తీసుకునే నేర్పు కూడా కావాలి. అలాగే ఓపిక, సహనం చాలా అవసరం. ఇవన్నీ ఉన్నవారే కఠినమైన ఈ పరీక్షలో రాణిస్తారు.