JAISW News Telugu

CM Jagan : ప్రత్యర్థుల పొత్తుల వేళ.. జగన్ ‘హస్తిన యాత్ర’ మతలబేంటో?

Jagan's 'Hastina Yatra

Jagan’s ‘Hastina Yatra’

CM Jagan : ఏపీలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుండడం, ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. పార్టీల అధినేతలు తమ అస్త్రశస్త్రాలను వేగంగా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ ఇప్పటికే దాదాపు సగం మంది దాక అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ, జనసేన అధినేతలు బీజేపీని తమతో కలుపుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు నిన్న వెళ్లగా.. నేడు పవన్ వెళ్లారు. ఇక వీరిద్దిరి ఢిల్లీ యాత్రతో జగన్ కూడా ఢిల్లీ పర్యటన ఖరారు  చేసుకున్నారు. ఏపీ నేతల హస్తిన యాత్రలతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది.

సీఎం జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.  రేపు (శుక్రవారం) ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.  ప్రస్తుతం టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తులు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. జగన్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు అమిత్ షా భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరడంపై దాదాపు నిర్ణయం తీసుకున్నారు.

ఒకట్రెండు రోజుల్లో ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రీయింబర్స్ చేస్తుందని తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటు పరిష్కారం కావాల్సిన పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా..ఆకస్మికంగా జగన్ ఢిల్లీ పర్యటనపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్  ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు పొత్తు ఖాయమేనని తెలిసి జగన్ ముందస్తుగా కేంద్ర పెద్దలను తనపై ‘సానుకూలత’ను పెంచుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. టీడీపీతో పొత్తు ద్వారా తన ప్రత్యర్థి శిబిరంలో బీజేపీ ఉంటుంది కనుక మోదీ, అమిత్ షాలు జగన్ ను ప్రత్యర్థిగానే భావిస్తారు. అందుకే ముందుగానే వారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నారని చర్చించుకుంటున్నారు.

Exit mobile version