Kodipunju Story : సంక్రాంతి వేళ.. కోడిపుంజు కథ.. తెలుసుకోవాల్సిందే

Kodipunju Story

Kodipunju Story viral

Kodipunju Story : కోడికూర.. చిల్లుగారె.. తాటికల్లు.. అబ్బా కాంబినేషన్ అదుర్స్ కాదూ..సంక్రాంతి పండుగ వేళ ఓ మాంచి పందేం కోడి దొరికితే తీసుకుని ‘ఎక్ దమ్’ పార్టీ చేసుకుందామని ప్లాన్ లు కూడా వేసుకుంటారు లిక్కర్ ప్రియులు.. ఇక పండుగకు వచ్చే కొత్త అల్లుడికి నాటుకోడి కోసి..బీరు బాటిల్ తెద్దామనుకుంటారు అత్తమామలు. ఏదేమైనా కూరకైనా.. పందేనికైనా మన దగ్గర కోడి ఉండాల్సిందే. సంక్రాంతి పండుగ పూట ఆంధ్రా జనాలు కోడిపందేలకు రెడీ అయితే.. తెలంగాణ జనాలు మాత్రం మాంచి నాటుకోడి కోసం వెతుక్కుంటున్నారు.

తాజాగా ఓ మాంచి పందేం కోడిని బస్సులో మరిచిపోయాడు ఓ ప్రయాణికుడు. ఆ కోడి ఎవరిదా అనే సిబ్బంది వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో దాన్ని డీపోలో అప్పగించారు. బస్సులో దొరికినా ఏ వస్తువైనా, జంతువైనా అధికారులు సొంతానికి వాడుకోకుండా వేలం వేస్తారు. ఆ కోడిని కూడా వేలం వేయాలని భావించారు. అప్పటి దాకా దాని సంరక్షణ ఆర్టీసీ సిబ్బందిపై పడింది. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ కోడి పుంజు ప్రత్యక్షమైంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో దిగుతున్న ప్రయాణికుడికి పక్క సీట్లో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగు కనిపించింది. దీంతో వెంటనే ఆయన  కంట్రోలర్ కు సమాచారం అందించారు. దీంతో వారు ఆ బ్యాగును తీసి అందులో కోడి ఉండడం చూసి అవాక్కయ్యారు. పకడ్బందీగా ప్యాక్ చేసి ఉన్న కోడిని బయటకు తీశారు. ఆ వ్యక్తి వచ్చే దాక లేదా వేలం వేసేదాక దాని సంరక్షణ బాధ్యత ఆర్టీసీ సిబ్బందిపైనే పడింది.

ఇక అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. దాన్ని రక్షించే బాధ్యత రెండో డిపో సిబ్బందిపై పడింది. రోజువారీ విధులు నిర్వహణలో బిజీగా ఉన్న తమకు కోడి ఆలనా పాలన చూసుకోవడం కష్టంగా మారింది. దాన్ని ఎటుపోకుండా చూడడం, దాణా వేయడం, నీళ్లు పెట్టడం వంటి పనులు విడతల వారీగా చేస్తున్నారు. ఇక అధికారులు ఆ కోడిని వేలం వేయాలని నిర్ణయించారు.

ఈ కోడి కథ కొసమెరుపు ఏంటంటే.. సదరు కోడి పుంజు యజమాని మహేశ్.. తన కోడి కథ రెండు రాష్ట్రాల్లో వైరల్ కావడంతో.. వేలం వేస్తున్న విషయం అతడికి తెలిసింది. అతడు ఓ వీడియో చేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు. తనది ప్రకాశం జిల్లా కావాలి అని, తాను సిరిసిల్ల జిల్లాలో మేస్త్రీ పని చేస్తుంటానని, సోమవారం పండుగ కోసం ఆంధ్రాకు వెళ్తుండగా బస్సులో తన కోడి ఉన్న బ్యాగును మరిచిపోయానని అందులో చెప్పుకొచ్చాడు. వేలం పాటను ఆపాలని సజ్జనార్ ను వేడుకున్నారు. తన కోడికి సంబంధించిన ఫొటోలు, రుజువులు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.

TAGS