Jagan – KCR : ఆస్తుల పంపకాలు సరే.. వీరి నోళ్లు మూసేదెట్లా..!
Jagan – KCR : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసందే. రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలు, ఆస్తుల పంపకాలు, తదితర విషయాల గురించి చర్చించేందుకు 6వ తేదీ కలుద్దామని లేఖ సారాంశం. ఒకరికొకరం సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. చంద్రబాబు రేవంత్ కు రాసిన లేఖను ఎక్స్ లో పెట్టారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. కనుక ఇరువురి భేటీ ఖాయమని తెలుస్తోంది. విభజన సమస్యలు పరిస్కరించుకునేందుకు ఇరు వైపులా అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్ గతంలో తెలుగుదేశంలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో బాబు కీలకంగా మారినందున విభజన సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని ప్రజలు అనుకుంటున్నారు.
ఇరువైపులా అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా.. ప్రతిపక్షాలు మాత్రం ఏదో ఒక విషయాన్ని జొప్పించి రాజకీయం చేయాలనుకుంటాయి. దాని కోసమే ఇటు కేసీఆర్ అటు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అటు రేవంత్, ఇటు చంద్రబాబును దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన అవకాశం అని అనుకుంటున్నారు. బాబు, రేవంత్ రెడ్డి భేటీతో వారికి మంచి అవకాశం లభించబోతోంది. చంద్రబాబుకు తెలంగాణను అప్పగిస్తాడని కేసీఆర్, శిష్యుడి కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని జగన్ రాజకీయాలు మొదలుపెట్టడం ఖాయం.
వీరిద్దరి మధ్య చర్చలు ప్రతిపక్ష నాయకులకు ఎక్కువ ఉపయోగపడేలా కనిపిస్తోంది. కనుక ఇరువైపులా సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు మాజీల కౌంటర్లకు ఎన్ కౌంటర్లను కూడా సిద్ధం చేసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సహకారం, విభజన సమస్యల పరిష్కారం ఎంత అవసరమో ప్రజలకు వివరించాలి. ఇంతకాలం జగన్, కేసీఆర్ రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని, దాని వలన ఇరు వైపులా జరిగిన నష్టం గురించిప్రజలకు అర్థం అయ్యే రీతిలో వివరించాలి. అప్పుడే ప్రతిపక్ష నాయకులు సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.