Ravichandran Ashwin : అశ్విన్ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్ గా చరిత్ర పుటల్లోకి..
Ravichandran Ashwin : రాజ్ కోట్ లో జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్ లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. 500 వికెట్ల మైలురాయిని దాటి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. అశ్విన్ తన 98వ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. అశ్విన్ 500 వికెట్లు సాధించే క్రమంలో 34 వికెట్ల ఘనతలు, ఎనిమిది 10 వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. టెస్ట్ ల్లో అశ్విన్ అత్యుత్తమ గణాంకాలు 7/59(ఇన్నింగ్స్), 13/140 గా (మ్యాచ్) ఉన్నాయి.
అశ్విన్ భారత్ తరపున టెస్టుల్లో రెండో అత్యధిక వికెట్ టేకర్ గా ఉన్నాడు. అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశారు. ఓవరాల్ గా అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్ గా రికార్డులకెక్కాడు. టెస్ట్ ల్లో అత్యధిక వికెట్ల రికార్డు లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) పేరిట ఉంది. ఈ జాబితాలో షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(696), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్ గ్రాత్ (563), వాల్ష్ (519), నాథన్ లయోన్ (517) అశ్విన్ కు ముందు ఉన్నారు.
అశ్విన్ మరిన్ని రికార్డులు:
– బంతుల పరంగా అత్యంత వేగంగా (25714) 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో మెక్ గ్రాత్(25528) అశ్విన్ కంటే ముందున్నాడు.
-మ్యాచ్ ల పరంగా అత్యంత వేగంగా(98) మ్యాచ్ ల్లోనే 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో బౌలర్ గా రికార్డు. మురళీధరన్ 87 టెస్టులతో టాప్ లో ఉన్నాడు.