PBKS Vs MI : ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య ముల్హన్ పూర్ లో జరిగిన పోరులో పంజాబ్ బ్యాటర్ అశుతోష్ పోరాటం వృథా అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 10 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇషాన్ కిషన్ త్వరగానే ఔటైన సూర్య కుమార్ యాదవ్ తనదైన ఆటతీరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఓ వైపు రోహిత్ శర్మ సపోర్టు ఇస్తుండగా.. సూర్య మూడు సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 53 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. మొదటి ఇన్సింగ్స్ ముగిసే సరికి ముంబయి 192/7 పరుగులు చేసి పంజాబ్ కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్ల లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్లు సామ్ కర్రన్, ర్యాలీ రోసో, లివింగ్ స్టన్ ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో పంజాబ్ 14/4 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శశాంక్ సింగ్ మ్యాచ్ ను చక్కదిద్దే పని పెట్టుకున్నాడు. అప్పటి వరకు పంజాబ్ కు ఉన్న ప్రెషర్ ను కాస్త ముంబయికి మళ్లించాడు. శశాంక్ సింగ్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. కేవలం 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు.
అప్పటికే క్రీజులోకి వచ్చిన నయా పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ అశుతోష్ శర్మ ముంబయి బౌలర్లపై ఎదురుదాడికి దిగి 7 సిక్సులు బాదాడు. కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంజాబ్ ను గెలిపించినంత పని చేశాడు. 18 బంతులకు 23 పరుగులు ఉన్న దశలో అశుతోష్ అవుట్ కావడంతో ముంబయి ప్లేయర్లు ఊపిరి పీల్చుకున్నారు. ముంబయి బౌలర్లలో కోయాట్జీ మూడు వికెట్లు పడగొట్టాడు. కీలక సమయంలో అశుతోష్ శర్మ వికెట్ తీసి ముంబయికి విజయం ఖాయం చేశాడు. ఆఖర్లో రబాడ సిక్సు కొట్టి ఆశలు రేపినా.. చివరకు రనౌట్ కావడంతో ముంబయి 10 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.