PM Modi : మోదీ ఉన్నంత కాలం ఆయనే ప్రధాని..
PM Modi : సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. 75 ఏళ్లకు మోడీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని ఆయన ఆరోపించారు. అలాంటి చాన్సే లేదని ఆయన ఉన్నంత కాలం.. ఆయనే ప్రధాని అని అమిత్ షా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ మరి బీజేపీ విలువలు ఏమయ్యాయని ప్రశ్నలు ఆ పార్టీకి తగులుతున్నాయి. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా విషయాలపై మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితంగా బీజేపీ కూటమి కచ్చితంగా 400 సీట్లు దాటుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రామ మందిరం, ఆర్టికల్ 370, రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. ప్రధాని మోడీ రిటైర్మెంట్పై అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఆయన మాట అంతగా వినాల్సిన అవసరం లేదు. నేను నిన్న స్పష్టం చేశాను. ఈరోజు మీకు మరోసారి స్పష్టం చేస్తున్నాను. 2029 వరకు మోడీ ప్రధానిగా ఉంటారు. 29 తర్వాత కూడా మోడీ మా పార్టీని నడిపిస్తారన్నారు.
బీజేపీ మోడీ, షా చేతుల్లోకి వచ్చిన తర్వాత 75 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం బంద్ చేశారు. ఈ నిబంధన చూపించి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి దిగ్గజాల్ని కూడా పక్కకు పెట్టేశారు. ఇప్పుడీ నిబంధన నరేంద్రమోడీకి మాత్రం వర్తించదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిని మోడీనే సృష్టించారు. బీజేపీకి పెద్ద దిక్కు ఆయన తప్ప మరొకరు కాదన్న భావన కల్పించారు. నరేంద్రమోడీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు బీజేపీని నడిపించిన సీనియర్లు అందర్నీ ఇప్పటికే వీరు కలిసి పక్కకు తప్పించారు. ఇప్పటికీ కేంద్ర పదవుల్లో ఉన్న గడ్కరీ, రాజ్ నాథ్ వంటి వారి పరిస్థితి నల్లేరు మీద నడకలా ఉంది. వారు ప్రధాని పదవి గురించి ఆలోచించే పరిస్థితులు అయితే లేవు. మోడీ ఉన్నంత కాలం ఆయనే ప్రధాని అని బీజేపీ నేతలు చెబుతున్నారు. నిజానికి ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. కొత్త వారికి అవకాశాలు కల్పించాలి. మోడీ లేక ముందు కూడా దేశం ముందుకెళ్లింది.. మోడీ ఉన్నప్పుడూ కూడా.. మోడీ తర్వాత కూడా దేశం ప్రశాంతంగా ముందుకెళ్తుంది. వారు ఉన్నప్పుడే దేశానికి కొత్త నాయకత్వం అందించడం అసలైన పాలకుల లక్షణం. కానీ మోడీ… తన వరకూ తమ పార్టీలో రూల్ ను అమలు చేయడానికి అంత సుముఖంగా లేరు. తానున్నంత వరకూ ఆయనే కింగ్ మేకర్ గా ఫిక్స్ అయ్యారు.