Artificial Womb : వీర్యం, అండం లేకుండానే బిడ్డకు జన్మ..అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్న ఆ దేశ సైంటిస్టులు..

Artificial Womb, Human Embryos
Artificial Womb : ప్రపంచం ఆధునాతన సాంకేతికత వైపు పరుగులు పెడుతోంది. ప్రతీ మనిషి ఏదో రకమైన సాంకేతికతతో ప్రయోజనం పొందుతూనే ఉన్నారు. రానున్న రోజుల్లో మనిషినే ఈ సాంకేతికత డామినేట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
టెక్నాలజీని ఉపయోగించి ఇటీవల బిడ్డకు జన్మనిస్తున్న మిషన్ గురించి మనకు తెలిసిందే. 9 నెలల పాటు తన కడుపులో బిడ్డ పెరిగే మధురమైన అనుభూతిని స్త్రీ మాత్రమే పొందగలుగుతుంది. అయితే భవిష్యత్ లో ఈ సంతోషానికి మహిళలు దూరమయ్యే అవకాశం ఉంది. ఒక వైపు ఫేస్ బుక్ , యాపిల్ , టెస్లా, మైక్రో సాఫ్ట్, గూగుల్ సహ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కృత్తిమ మేధపై పనిచేస్తున్నాయి. దీనిలో నుంచే ఒక టెక్నాలజీకి సంబంధించి వార్త ఒకటి బయటకు వచ్చింది. తల్లి కడుపులో బిడ్డను పెంచడం ఇష్టం లేని మహిళలు.. భవిష్యత్ లో తల్లి కావాలనుకునే మహిళలు యంత్రం ద్వారా బిడ్డకు జన్మనివ్వొచ్చు.
ఈ టెక్నాలజీ పేరు ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీ. ఇది ప్రపంచలోనే తొలి కృత్తిమ పిండంలాగా పనిచేస్తుందని యాక్టో లైఫ్ పేర్కొంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సాంకేతికతలో శిశువును కృత్తిమ గర్భంలో పెంచుతారు. పిండ దశ నుంచి 9 నెలల తర్వాత బేబీ బయటకు వచ్చే వరకు మొత్తం సంరక్షణ యంత్రాల ద్వారా నిర్వహించబడుతుంది.
అయితే తాజాగా మరో టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో మగవారి వీర్యం, ఆడవారి అండాలు లేకపోయినా.. మానవ పిండం తయారుచేయవచ్చు. ఇలా చేసి నిరూపించారు ఇజ్రాయెల్ సైంటిస్టులు. వీర్యం, అండం, గర్భాశయం లేకుండా మానవ పిండం నమూనాలను పెంచినట్టు వారు పేర్కొన్నారు. దీనిలో మానవ మూలకణాల, ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాలను తీసుకుని.. వీటిని అంతకు మునపటి దశకు తీసుకెళ్లారు.
ఈ దశలో ఇవి ఏ రకమైన కణంగానైనా రూపాంతరం చెందే అవకాశం ఉంది. వాటితోనే మానవ పిండ నమూనాలను రూపొందించారు. ఇలా చేసిన పిండాన్ని గర్భాశయం బయటనే 14 రోజుల పాటు పెంచుతారు. త్వరలోనే దీనిపై పరిశోధనలు చేసి 21 రోజులకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎక్కడా ఫలదీకరణం చెందిన అండాలను లేదా గర్భాశయాన్ని ఉపయోగించలేదు. ఈ పరిశోధనను ‘జర్నల్ నేచర్’ ప్రచురించింది.