CMs Arrest : రెండు నెలల్లో ఇద్దరు సీఎంల అరెస్ట్..ఎన్నికల వేళ సంచలనం..
CMs Arrest : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అరెస్ట్ ను ఆప్ నేతలు ఖండించారు. అరెస్ట్ కు నిరసనగా కార్యకర్తలతో కలిసి సీఎం ఇంటి ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు.
మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని గురువారం ఈడీ తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ఈడీని కోర్టు ఆదేశించగా వారు తగిన పత్రాలు అందించారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ నుంచి కేజ్రీవాల్ కు రక్షణ కల్పించలేమని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి సోదాలు చేసి ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు.
సీఎం పదవిలో ఉంటూ అరెస్టయిన మొదటి వ్యక్తి కేజ్రీవాలే. గతంలో బిహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలు ప్రసాద్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవికి అప్పగించారు. ఇటీవల అరెస్టయిన హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ కు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు.
కాగా, ఎన్నికల వేళ రెండు నెలల సమయంలో రెండు రాష్ట్రాల సీఎంల అరెస్ట్ దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అవినీతి కేసుల్లో రెండు నెలల వ్యవధిలో వీరు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే కావడం విశేషం. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో నిన్న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. అయితే దేశంలోని అధికార పార్టీ బీజేపీ కుట్రపూరితంగానే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తోందని, ఈడీ అధికారులు అధికార పక్షం చెప్పినట్టు నడుచుకుంటోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. పదేళ్ల కాలంలో ఒక్క ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయలేదని, వారంతా సొక్కంపూసలా అని ప్రశ్నిస్తున్నారు.