Pinnelli Ramakrishna Arrest : ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు. నరసారావుపేటలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
మే 13న మాచర్లలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన టీడీపీ ఏజెంట్లపై దాడికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో అరెస్టు కాకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అప్పట్లో పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తొలుత ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ అరెస్టు కాకుండా ఊరటనిచ్చిన హైకోర్టు అనంతరం దాన్ని పొడిగించింది.
ఈరోజు (బుధవారం) ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్గు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిన్నెల్లి అరెస్టు కాకుండా బయట ఉంటే సాక్షుల్ని భయపెట్టే అవకాశం ఉందని, ఆధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గతంలో పిన్నెల్లి అరెస్టు కాకుండా ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.