Chandrababu : ఏపీలో పసుపు సునామీకి వైసీపీ పాతాళంలోకి పడిపోయింది. కూటమి దెబ్బకు జగన్ పార్టీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. చంద్రబాబు చాణక్యం, పవన్ దూకుడుతో కూటమికి అంబరమంతా విజయాన్ని ఇచ్చారు ఏపీ ప్రజలు. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ సాధించని ఘనత సాధించారు. ఈ అద్భుత విజయాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాయి. ప్రపంచ నలుమూలల్లో స్థిరపడిన ఏపీ ప్రజలు టీడీపీ ఘన విజయంతో సంబరాలు చేసుకున్నారు.
అశేష టీడీపీ అభిమానులు గత ఐదేండ్లుగా ఎదురుచూస్తున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈమేరకు పనులు కూడా ప్రారంభిస్తున్నారు. యువనేత నారా లోకేష్ ఆదేశానుసారం హైదరాబాద్ కు చెందిన RK ఈవెంట్స్ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం 15 లారీల్లో మెటీరియల్ తీసుకొచ్చారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని టీడీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారం అమరావతిలో నిర్వహించనున్నారు. అయితే స్థలం నిర్ణయించాల్సి ఉంది.
చంద్రబాబుతో పవన్ సైతం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అయితే అదే రోజు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా, నేడు ఉదయం 10 గంటలకు తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పనున్నారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత ఉదయం 11 గంటలకు పవన్ తో కలిసి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతారని చెబుతున్నారు. బీజేపీ నిర్వహించే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టుతోంది. ఈక్రమంలో చంద్రబాబు ఎన్డీఏ సమావేశానికి హాజరై తన ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలను, ఎన్డీఏ సహచరులను ఆహ్వానించనున్నారు.