Mukesh Kumar Meena : ఏపీలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో ఇప్పటి వరకు మొత్తం 864 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు వరకు రూ. 382 కోట్లు సీజ్ చేశామన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ నిఘాలో పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఎలాంటి అంశాన్నయినా సి-విజిల్ యాప్ ద్వారా తెలుపాలని కోరారు.