Low Salary : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఓ కల. అది సాధించిన వాళ్లను ఏదో యుద్ధంలో గెలిచి వచ్చిన వాళ్లను చూసినట్లు చూస్తుంటారు. ప్రస్తుతం చదువుకున్న వాళ్లు నమ్ముకున్న వాళ్లను కాపాడుకోవడానికి ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అందుకే కాస్త జీతం అటుఇటు అయినా ఉద్యోగాలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు కంపెనీలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. ఏంటని ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అందుకే జీతం పెరిగినా పెరగకున్నా చచ్చినట్టు ఉద్యోగం చేస్తున్నారు.
దీంతో వారి జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఓవైపు భారీగా పెరుగుతున్న ఖర్చులు, మరో పక్క కంపెనీలు ఇచ్చే తక్కువ జీతాలతో వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఊరించి జీతాల పెంపు వచ్చే సరికి ఉద్యోగులను ఉసూరుమనిపిస్తుంటాయి కంపెనీలు. ఓ వైపు కూరగాయల నుంచి పెట్రోల్ వరకు రోజు రోజుకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో అటు ముందుకు పోలేక ఇటు వెనక్కి రాలేక చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే తమకు జీతం ఎందుకు పెంచడం లేదు అంటే ఏదో సాకు చెప్తుంటారు. అయితే ఇది ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు..అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి.
మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువే ఉంటాయి. వాళ్లకేంటిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఐటీ ఉద్యోగం చేస్తూ కార్పొరేట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అందరూ భావిస్తారు. అయితే ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఐటీ రంగంలోని కంపెనీలు చాలా కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరే వారికి అతి తక్కువ జీతాలు ఇస్తున్నాయని విమర్శిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఉద్యోగుల వేతనాలకు కారణాలను, ఏ ఉద్యోగి అయినా ఎక్కువ శాలరీ పొందాలంటే ఏం చేయాలనే దానిపై ఇటీవల టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ ఇటీవ కొన్ని టిప్స్ చెప్పారు.
ఫ్రెషర్స్కు చాలా కాలం నుంచి రెండు మూడు లక్షల రూపాయల వార్షిక వేతనం లభిస్తోందని మిలింద్ లక్కాడ్ అన్నారు. ఫ్రెషర్ అయినా అనుభవం ఉన్న ఉద్యోగులైనా ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ ని పెంచుకుంటే వారు డబుల్ జీతం పొందొచ్చన్నారు. అప్పుడు శాలరీ రూ.10 లక్షల వరకు చేరుతుందని ఆయన తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF) ప్రకారం 2022లో ఐటీ సెక్టార్ లో జాబ్ లో చేరిన ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సగటున రూ.4.57 లక్షల వార్షిక వేతనం లభించింది. ఇది 2021 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ. 2017-18లో ఈ వేతన సగటు రూ.3.19లక్షలుగా ఉండగా.. గడిచిన ఐదేళ్లలో ఇది 43 శాతం ఎక్కువ.