JAISW News Telugu

Telangana : తెలంగాణలో అనూహ్య ఫలితాలే రానున్నాయా?

Telangana

Telangana

Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధానమైన ఎన్నికల ఘట్టం ముగిసింది.  తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సాఫీగా సాగింది. అటు ఏపీలో చెదురు ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, మాజీ మంత్రులు, టాలీవుడ్ సెలెబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 64.93 శాతం మేర పోలింగ్ నమోదైంది. 10 స్థానాల్లో పోలింగ్ శాతం 70ని దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జంటనగరాల పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా 60 నుంచి 70 శాతం లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాల వారీగా చూస్తే..  ఆదిలాబాద్ : 72.96, పెద్దపల్లి :  67.88, కరీంనగర్ : 72.33, నిజామాబాద్ :  71.50, జహీరాబాద్ : 74.54, మెదక్ : 74.38, మల్కాజ్‌గిరి :  50.12, సికింద్రాబాద్ :  48.11, హైదరాబాద్ :  46.08, చేవెళ్ల :  55.45, మహబూబ్‌నగర్ : 71.54, నాగర్‌కర్నూల్ :  68.86, నల్గొండ : 73.78, భువనగిరి :  76.47, వరంగల్ : 68.29, మహబూబాబాద్ :  70.68, ఖమ్మం :  75.19 శాతం పోలింగ్ నమోదైంది.

గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. సికింద్రాబాద్, హైదరాబాద్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదన్న విషయం తేటతెల్లం అవుతోంది.  బీఆర్ఎస్ విజయం సాధించిన నియోజకవర్గాల్లో అంచనాలకు తగ్గట్టే పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా పోలింగ్ నమోదయిన జాబితాలో భువనగిరి, ఖమ్మం స్థానాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కాంగ్రెస్ కి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలు ఇవి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది జూన్ 4న తేలనుంది.  

తెలంగాణలో త్రిముఖ పోటీ పోటీ పోయి ప్రధానంగా రెండు పార్టీల మధ్యే హోరాహోరీగా పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నిర్ణయించనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ ఓటింగ్‌ భారీ స్థాయిలో చీలిపోయిందనే అభిప్రాయాల మధ్య మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టు నిలబెట్టుకోవడం కంటే కాంగ్రెస్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే కనిపించిందని పోలింగ్ సరళినిబట్టి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version