Serial Actor Chandu : బుల్లితెరలో వరుస విషాదాలతో తెలుగు ప్రేక్షకులు తీవ్ర దిగ్ర్భాంతి చెందుతున్నారు. త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవడంతో అయ్యో పాపం అంటూ ఆవేదన చెందుతున్నారు. మొదట ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషించిన పవిత్రా జయరాం యాక్సిడెంట్ లో చనిపోయింది. ప్రేక్షకులు ఆ షాక్ నుంచి బయట పడేలోగా, అదే సీరియల్ లో నటించిన చంద్ర కాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్రా జయరాం కారు ప్రమాదానికి గురైనప్పుడు, అదే కారులో చందు కూడా ప్రయాణించాడు. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. ఇదే ప్రమాదంలో పవిత్ర మరణించారన్న విషయాన్ని చందు తట్టుకోలేకపోయాడు.
ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. ఈ క్రమంలో పవిత్ర మరణాన్ని భరించలేక చందు కూడా బలవన్మరణానికి పూనుకొన్నాడని తెలుస్తోంది. చంద్రకాంత్ కు ఇది వరకే పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్రినయని సీరియల్ సమయంలో పవిత్రతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పవిత్రకి కూడా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కొన్ని లీగల్ ఇష్యుస్ ఉన్నందవల్ల వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.
చందు భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. చందు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, చాలా అన్యోన్యంగా ఉండేవారమని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. మొదట సీరియల్స్ లో ఆఫర్స్ తానే ఇప్పించానని, వరుసగా ఆఫర్స్ వచ్చాయని కానీ త్రినయని సీరియల్ నుంచి తనకి కష్టాలు మొదలయ్యాయని, పవిత్ర వల్ల తన భర్త మారిపోయాడని, పూర్తిగా తమని వదిలేశాడని, ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, ఆమె పిచ్చిలో బతుకుతున్నాడని వాపోయింది.
పవిత్రపై పెంచుకున్న ప్రేమే చందుని అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందని శిల్ప భావోద్వేగానికి గురైంది. పవిత్ర సడెన్ గా చనిపోవడంతో అది జీర్ణించుకోలేని చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, అతడి సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థం అవుతోందని తెలిపింది. ఆమెని తల్చుకుంటూ ‘‘పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. మరోవైపు పవిత్ర మరణానికి చందూనే కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం చందూని దారుణంగా ట్రోల్ చేసింది. ఇది కూడా చందూ తట్టుకోలేకపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇందులో నిజనిజాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఏదేమైనా ఐదారు రోజుల గ్యాప్ లో ఇద్దరు సహచరులు చనిపోవడంతో బుల్లితెర నటులు, సాంకేతికవర్గం షాక్ లో ఉన్నారు.