Cases Against KCR : మూడో సారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీఆర్ఎస్ హైకమాండ్ కు అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొదట్లో 100 రోజుల దాక టైమ్ ఇస్తామని చెప్పిన నేతలు..ఇప్పుడే ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో బూటకపు హామీలు ఇచ్చారని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శిస్తున్నారు. ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ నేతల మాటలపై సీఎం, మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ ను నాలుగు ముక్కలు చేస్తామని, కేసీఆర్ కు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. త్వరలోనే పులి బయటకు వస్తోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ స్పందిస్తూ..‘‘పులి బయటకు వస్తే బోనులో బంధిస్తాం’’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ భూమిలో పాతిపెడుతామని మండిపడ్డారు.
ఇదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు ప్రాజెక్టులు, పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన అవినీతితో రూ.3,200 కోట్లు వృథా అయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇందులో 32 మంది అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా.. ఇప్పుడు బ్యారేజీ మొత్తం సమస్యలు ఉన్నట్లు తేల్చింది. మరమ్మతులు చేసినా నిరుపయోగమేనని విజిలెన్స్ భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్ధమైంది.
మేడిగడ్డ బ్యారేజీలో 11 పిల్లర్లు(పియర్లు) దెబ్బతిన్నాయని, రూ.3625.82 కోట్లతో బ్యారేజీని నిర్మించగా.. అందులో రూ.3200 కోట్ల వరకు వృథా అయ్యాయని నివేదిక పేర్కొంది. నిర్మాణ సమయంలో ప్రతీ అధికారి ఈ వృథా ఖర్చులకు బాధ్యత వహించాలని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ విచారణలో అక్రమాల చిట్టా బయటకు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుపై కేసులు పెట్టడం తథ్యమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.