Revanth-Congress : రేవంత్ నిర్ణయాలు కాంగ్రెస్ ను రిస్క్ లో పడేస్తున్నాయా?

Revanth-Congress

Revanth-Congress

Revanth-Congress : తెలంగాణలో పార్లమెంట్ పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొన్ని మార్పులు సూచించిన రేవంత్, అధికార చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పారు. ఇక TS కాస్తా TG గా మార్చారు. దీనిపై కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇలా కేసీఆర్ ముద్ర రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదని భావించిన రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను పెట్టాలని కోరగా.. కేసీఆర్ సమయం తీసుకున్నాడు. కానీ రేవంత్ మాత్రం కీరవాణితో రికార్డింగ్ కూడా పూర్తి చేయించారు. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా.. తెలంగాణ అధికారిక ముద్రపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. గతంలో కాకతీయుల కళాతోరణం ముద్రపై ఉండేది. కానీ ఇది రాజరికానికి గుర్తుగా భావించిన రేవంత్ దీని స్థానంలో మరోటి తీసుకువస్తామని చెప్పారు. అయితే అది ఎలా ఉండబోతోందో మాత్రం చెప్పలేదు.

అయితే, రేవంత్ తప్పు కోసం గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కు ఇదే ఒక ఆయుధంగా దొరుకుతుందా? అని సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం నిర్ణయాలపై కేసీఆర్ పెదవి విప్పలేదు. పొరుగు రాష్ట్ర మ్యూజిక్ డైరెక్టర్ తో రాష్ట్ర గేయాన్ని కంపోజ్ చేయించారంటూ బీఆర్ఎస్ పార్టీ అడపా దడపా నిరసనలు చేపట్టింది కానీ కేసీఆర్ దీనిపై కూడా నోరు మెదపలేదు.

ప్రతీ సారి సెంటిమెంట్ ను చూపి ఓట్లు దండుకునే కేసీఆర్ ఎక్కడ పొరాపాటు జరిగినా మళ్లీ సెంటిమెంట్ ను రగల్చి స్థానిక సంస్థలను స్వాధీనం చేసుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిహ్నం కనుక బయటకు వస్తే (జూన్ 2) ఆయన ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. రేవంత్ నిర్ణయం, కేసీఆర్ ను కాలగర్భంలో కలుపతుందా? లేక అదే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందా? అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి. 

TAGS