JAISW News Telugu

Chandra Babu : కేసీఆర్‌ కంటే బాబు విధానాలే మేలు?

Chandra Babu : రాష్ట్ర ప్రజలు రెండు సార్లు అవకాశం ఇవ్వగానే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆరాటపడ్డ కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని దేశాటన చేసి వివిధ రాష్ట్రాల్లో చాలా మందిని కలిశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కారణాలు అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్‌ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చి ఏపీలోని తోట చంద్రశేఖర్, కర్ణాటకలోని కుమారస్వామి వంటి రాజకీయ నిరుద్యోగులను వెంటపెట్టుకున్నారు. అయినా ఫలితం కనిపించలేదు.

కేసీఆర్‌ తన బృందంతో స్పెషల్ ఫ్లయిట్ లో బెంగళూర్ వెళ్లి కుమారస్వామిని, ఆయన తండ్రి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడను కలిసి వచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని, కుమారస్వామిని సీఎంను చేస్తానని హామీ ఇచ్చి వచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా సాయపడతారనే ఆశతో కుమారస్వామి కూడా కేసీఆర్‌ చుట్టూ తిరిగారు.

కానీ, కీలకమైన ఎన్నికల సమయంలో కేసీఆర్‌ హ్యాండివ్వడంతో కుమారస్వామి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కుమారస్వామి ఎన్డీయే కూటమిలో చేరి కేంద్ర మంత్రి కాగా, కేసీఆర్‌ సొంత రాష్ట్రంలో రెండు ఎన్నికల్లో (అసెంబ్లీ, సార్వత్రిక) ఘోరంగా ఓటమి పాలయ్యారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏనాడూ కుమారస్వామిని, హెచ్‌డీ దేవగౌడను కలువలేదు. కానీ ఇప్పుడు అదే కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విషయంలో బాబు వెంటే ఉండేందుకు ముందుకు రావడం మరో విశేషం. కేసీఆర్‌ను నమ్ముకున్నవారు.. వారితో స్నేహం చేసిన కుమారస్వామి, ఉద్దవ్ థాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సొరేన్ (ఝార్ఖండ్), అర్వింద్ కేజ్రీవాల్‌ (ఢిల్లీ) వంటి వారు ఘోరంగా నష్టపోయారు. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ కూడా నష్టపోవడమే కాక ఆయన కూతురు కవిత జైలు పాలైతే విడిపించుకోలేక సతమతం అవుతున్నారు.

కానీ చంద్రబాబు వెంట సాగిన ప్రతి ఒక్కరూ లాభపడ్డారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారికి కేంద్రంలో మంత్రి పదవులు లభించడమే దీనికి నిదర్శనం. చంద్రబాబు సానుకూల వైఖరి వల్లే ఇప్పుడు కుమారస్వామి కూడా ఏపీకి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాబట్టి తనను గొప్ప మేధావిగా భావించుకొని అహంభావంతో వ్యవహరించే కేసీఆర్‌ కంటే, చంద్రబాబు నాయుడి రాజకీయ విధనం సరైనదని, ఆలస్యమైనా సత్ఫలితాలు ఇస్తుందని తెలుస్తోంది.

Exit mobile version