AP Voters : హత్యా రాజకీయాలా.. అభివృద్ధా.. ఓటర్ల దారెటు ?

AP Voters

AP Voters

AP Voters :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగుకు మధ్యలో మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. రాబోయే ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించిన ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా సెంటిమెంటు రాష్ట్రాన్ని బాగా కుదిపేస్తోంది . సాధార‌ణంగా ఇటు రాష్ట్రంలోనైనా, అటు కేంద్రంలోనైనా ఎన్నికలంటే ప్రజల సమస్యలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలే తెరపైకి వస్తాయి.  వాటిపైనా ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంటుంది. మేం అభివృద్ధి చేస్తాం ఛాన్స్ ఇవ్వమంటే కాదు మాకు ఇవ్వండి ముందుకు తీసుకెళ్తామంటూ ఒక‌ప్పుడు పార్టీలు ముందుకు వచ్చేవి.

కానీ, ఈ దఫా ఎన్నికలు నేరాలు, హత్యలు, అవ‌మానాల సెంటిమెంట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగ‌ని అభివృద్ది-సంక్షేమాల చర్చ జరగట్లేదా అంటే అది కేవలం ఎక్కడో అడుగున ఒకటి అర శాతమే. మిగిలిన 90 శాతం కూడా.. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న నేరాలు, హత్యలు, అవ‌మానాల చుట్టూ తిరుగుతోంది. దీనిలో ప్ర‌తిప‌క్షా లు.. ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి. మా బాబాయిని హ‌త్య చేసిన వారికి ఓటేస్తారా? అంటూ.. వైఎస్ ష‌ర్మిల‌.. నా తండ్రిని చంపిన వారికి ఓటేస్తారా? అంటూ.. వైఎస్ సునీత‌లు తీవ్ర స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం ఎక్కడ నిర్వహించినా వైఎస్ ష‌ర్మిల ప్రధానంగా తన బాబాయ్ వివేకా దారుణ హ‌త్యను అస్త్రంగా చేసుకుంటున్నారు. క‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌స్తే.. అనంత‌బాబు.. త‌న డ్రైవ‌ర్‌ను హత్య చేసి డోర్ డెలివ‌రీ చేసిన ఘ‌ట‌న‌ను, డాక్టర్ సుధాక‌ర్‌పై పోలీసులు చేసిన దాష్టీకాన్ని ష‌ర్మిల నిలదీస్తున్నారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న కుటుంబాన్ని అడ్డంగా అవ‌మానించార‌ని.. త‌న భార్యను తిట్టార‌ని రెండు రోజుల నుంచి వాపోతున్నారు. అటు జనసేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇదే జాబితాలో చేరారు. త‌న సోద‌రి నారా భువ‌నేశ్వ‌రిని విమ‌ర్శించిన వారికి ఓటుతో జ‌వాబు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత‌లు రౌడీలుగా మారార‌ని.. వారికి ఓటుతో బుద్ది చెప్పాల‌ంటున్నారు. ఇక రాష్ట్రంలో రౌడీలు, మాఫియాలు పెరిగిపోయార‌ని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

వీరంతా ఇలా అంటుంటే అటు వైసీపీ మాత్రం.. అంద‌రూ క‌లిసి గుండుగుత్త‌గా త‌న‌పై యుద్ధానికి వ‌స్తున్నారని సీఎం జ‌గ‌న్ చెబుతున్న మాట‌. త‌ను ఇంత చేశాన‌ని.. అంత చేశానని చెప్పుకుంటున్న  చంద్ర‌బాబు ఏపీకి ఏం చేశాడో చెప్పాలంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మ‌రి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

TAGS