AP Vote on Budget : ఐదేళ్లలో జగన్ సర్కార్ సాధించింది ఇది.. బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన ‘బుగ్గన’..!
AP Vote on Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ రోజు (ఫిబ్రవరి 7) బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, కేంద్ర నిధుల వినియోగం గణాంకాలతో వివరణ ఇచ్చారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో రాష్ట్రం ఉండగా, 2023 వచ్చే వరకు స్థూల ఉత్పత్తి రేటు 16.2 శాతానికి పెరిగి రాష్ట్రం 4వ స్థానానికి చేరుకున్నట్లు బుగ్గన తెలిపారు. 2018-19 సంవత్సరంలో రాష్ట్ర సాగు రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 13 శాతంకు సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉందన్నారు.
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట బీమాను రైతులకు వర్తింప చేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఏపీయేనని ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. 13.6 లక్షల మంది రైతుల వద్దకు తమ సేవలను తీసుకెళ్లామని, మన రైతు భరోసా కేంద్రాలపై వరల్డ్ బ్యాంకు ప్రశంసలు కురిపించిందన్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో రాష్ట్రం రెండో స్థానం, దేశంలో మొదటి 15 జిల్లాల్లో, 6 జిల్లాలు మన రాష్ట్రానికి చెందినవే అన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏ.ఆర్) జాతీయ అరటి పరిశోధన సంస్థల నుంచి ఎగుమతికి గానూ ఏపీ ఉత్తమ రాష్ట్ర అవార్డును గెలుచుకుందన్నారు. 2019కి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేయగా, ఇప్పుడు లక్షా 67 వేల మెట్రిక్ టన్నులను ఎగుమతి చేస్తున్నామన్నారు.
చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటా, సముద్ర ఆహార ఎగుమతుల్లో 31 శాతంతో దేశంలో ముందంజలో ఉందని బుగ్గన తెలిపారు. ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా 2023 అవార్డు తీసుకున్నామన్న ఆయన పుంగనూరు పశువుల సంరక్షణకు వేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అందుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం కేవలం ఏపీనే అన్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మూడో స్దానంలో ఉన్నాం అన్నారు. కొత్త సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020లో 65,174 నమోదవగా.. 2023లో 7.20 లక్షలకు పెరిగాయన్నారు. దేశంలో 5 శాతం వాటాతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా రాష్ట్రం 7వ స్థానంలో ఉందన్నారు.
మైక్రోసాఫ్ట్, రిలయన్స్, జిందాల్, లారస్ సింథసిస్, అదానీ, టీసీఎస్, హీరో మోటోకార్ప్, యోకహామా, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రీన్ కో ఎనర్జీ వంటి దిగ్గజ పరిశ్రమలు నాలుగేళ్లలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో రాష్ట్రం మూడో స్థానాన్ని పొందిందన్నారు. విశాఖ పట్టణంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ గా ‘బ్లూ ఫ్లాగ్’ లేబుల్ను పొందిందన్నారు. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షికి కేంద్ర అవార్డు దక్కిందన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ పునరుత్పాదక ఇంధనంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడం, ఇంధనం, మౌలిక సదుపాయాల వినియోగం అంశాలకు ఏపీ 15వ ఎనర్షియా అవార్డు-2023 కింద 3 అవార్డులను అందుకుందన్నారు. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.10,460 కోట్లు కేంద్రం నుంచి విడుదల చేయించినట్లు బుగ్గన స్పష్టం చేశారు.
పౌర సరఫరాల సంస్థకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించినట్లు పేర్కొన్నారు. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావలసిన రూ.1050 కోట్ల గ్రాంటును తీసుకచ్చినట్లు బుగ్గన చెప్పారు. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా రూ. 30,497 కోట్ల గరిష్ఠ రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాం అన్నారు. అలుపెరగని పోరాటంతో పోలవరం నవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు.