JAISW News Telugu

AP Trending : టీడీపీ కూటమిదే విజయం

AP Trending

AP Trending

AP Trending : ఏపీలో ఎవరూ ఊహించిన విధంగా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పలుచోట్ల అర్ధరాత్రి వరకూ ఓటర్లు ఓటు వేశారు. భారీ స్థాయిలో పోలింగ్ జరుగడం ఎవరికీ నష్టం..ఎవరికీ లాభం అనే కోణంలో చర్చ విపరీతంగా నడుస్తోంది. ఈ చర్చల మాటలు ఎలా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఒకటే మోటివ్ కదిలినట్టు స్పష్టంగా కనిపించింది. జగన్ పాలనపై వ్యతిరేకత, అతన్ని మరోసారి గెలిపిస్తే రాష్ట్రం భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారుతుందనే భయంతోనే, జగన్ ను ఓడించడానికి ఓటర్లు కసిగా వచ్చి ఓటు వేశారని టీడీపీ కూటమి నేతలు అంటున్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

సోమవారం జరిగిన పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. దీంతోపాటు తమ నేతలు, ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం రోజంతా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వార్‌ రూమ్‌లోనే ఉండి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి టీడీపీ నాయకత్వం కొన్ని బృందాలను నియోగించింది. వారి నుంచి వస్తున్న సమాచారాన్ని కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు విశ్లేషించి జిల్లాల నేతలను అప్రమత్తం చేశారు. ‘పోలింగ్‌ సరళి మాకు పూర్తి సంతృప్తి కలిగించింది. మేం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నాం.

అన్ని విశ్లేషణలను చూసిన తర్వాత.. వాస్తవానికి భారీ ఓటింగ్ మూడు సందర్భాల్లో ముఖ్యంగా జరుగుతుంది. ఒక పార్టీ రాష్ట్రాన్ని తీవ్రంగా నాశనం చేసినప్పుడు ఆ పార్టీని ఓడించడానికి, ఒక అధికార పార్టీ మంచి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి మరోసారి అవకాశం ఇద్దామనుకున్నప్పుడు, ఒక పార్టీకి ఒక్క సారి చాన్స్ ఇద్దాం అనే ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు భారీ పోలింగ్ జరుగుతుంటుంది. అయితే ఆంధ్రాలో మొదటి దానికే ప్రజలు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జగన్ ఐదేండ్ల పాలనలో ఒక్క మంచి పని చేసింది లేదు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప. సంక్షేమ పథకాలను ఎవరైనా ఇవ్వగలరు. దానిలో పెద్ద పాలనా చాతుర్యం ఏముంటుంది. కానీ ఒక ప్రాజెక్టు కట్టాలి..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి..రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావాలి..రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి..మహానగరాలను తయారుచేయాలి.. ఇవి కదా సుపరిపాలన అంటే. కానీ జగన్ రెడ్డి అరకొర సంక్షేమ పథకాలకే పరిమితమై మిగిలినవన్నీ పక్కనపెట్టారు.

పాలకుడు అంటే సంక్షేమం, అభివృద్ధిని రెండు చక్రాలుగా చేసుకుని ముందుకెళ్లాలి. అది జగన్ చేయలేదు. కానీ చంద్రబాబు సీఎం అయితే ఆ రెండింటిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తారని ఓటర్లు భావించినట్టు అర్థమవుతుంది. అందుకే గంపగుత్తగా టీడీపీ కూటమికి ఓటు వేయడానికి తరలివచ్చినట్టు అర్థమవుతోంది. ఇక్కడ టీడీపీ  అధికారంలో ఉండి..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, రాజధానిగా అమరావతి నగర నిర్మాణానికి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కూటమి అధికారంలోకి వస్తే ఇలా ఎన్నో మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. కనుకనే ఓటర్లు ఒక లక్ష్యంతో వచ్చి టీడీపీ కూటమికి ఓటేసినట్టు కనపడుతోంది.

Exit mobile version